Janareddy: హైదరాబాద్ లో ఈ నెల 8వ తేదీన జరగనున్న నిరుద్యోగ నిరసన సభకు కార్యకర్తలు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరుద్యోగ నిరసన సభకు పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, పరిసర జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువతను తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపందిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండలో పర్యటించిన జానారెడ్డి.. మే 8న తలపెట్టిన నిరుద్యోగ నిరసన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిరుద్యోగుల పక్షాన, యువత తరఫున కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. 


పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అంతా సమానమే..!


గత నెల 28వ తేదీన నల్గొండజిల్లాలో జరిగిన నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేసిన నిరుద్యోగులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నుండి కార్యకర్త వరకు అందరూ సమానులే అని జానారెడ్డి అన్నారు. పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని  ఆయన కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ చిన్నచూపు చూడకూడదని జానారెడ్డి సూచించారు. 


నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగ సభను ఎలా విజయవంతం చేశారో అదే విధంగా హైదరాబాద్ ఈ నెల 8వ తేదీన జరగనున్న నిరుద్యోగుల నిరసన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ప్రియాంక గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. సమయం లేకపోవడంతో, ఆరోగ్యం బాగోలేక పోవడం వల్లే భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొనలేక పోతున్నానని జానారెడ్డి చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో సాగుకు నీళ్లు పారుతున్నాయని, ఇంకా 7 నుండి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. 


కర్టాటక టు హైదరాబాద్


మే 10 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంక గాంధీ మే 8న ఆమె హైదరాబాద్ కు రానున్నారు. సరూర్‌నగర్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న ఉద్యమానికి ఈ సమావేశం బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. నిరుద్యోగం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారించాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రస్తుతం కేసును విచారిస్తోంది.