Komatireddy Venkat Reddy | హైదరాబాద్: టాలీవుడ్ లో కార్మికుల సమ్మె ప్రభావంతో గత తొమ్మిది రోజులుగా వివిధ సినిమాలు సెట్టెక్కెలేదు. మరోప్రక్క సమ్మె ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిర్మాతలు సైతం ఫెడరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో కార్మికుల డిమాండ్లు నెరవేరేలా లేవు. నిర్మాతలు తగ్గేలా లేరని అంతా అనుకుంటున్న సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెట్టి ఎంట్రీ మొత్తం సీన్ నే మార్చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో..
సోమవారం ఒక్కరోజు జరిగిన చర్చలు దాదాపు సమస్యను ముగింపువరకూ తీసుకెళ్లాయి. అయితే ఇంతలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరువర్గాలతో మాట్లడటం, వేగంగా పరిష్కారం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలేని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ది చెందుతున్న సమయంలో ఏంటీ సమ్మె, కార్మికుల సమస్య మరిత జఠిలం కాకుండా రంగంలోకి దిగాలంటూ మంత్రి కోమటి రెడ్డిని ఆదేశించడంతోనే ఇంతలా ఒకే ఒక్కరోజులో ఇరువర్గాలను ఓ దారికి తెచ్చారట మంత్రి.
దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించిన మంత్రి
తాజాగా కోమటి రెడ్డి వెంకటరెడ్డితో సినీ కార్మికుల సమస్యలపై ఫెడరేషన్ నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో ఇండస్ట్రీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీతాలు 30శాతం పెంచాలనే డిమాండ్ లపై ఫెడరేషన్ నేతలు చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దిల్ రాజుకు మీ సమస్యలు పరిష్కరించే భాద్యత అప్పగించాను. దిల్ రాజు అటు నిర్మాతలతో ఇటు కార్మికులతో చర్చించి ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా ఓ సానుకూల పరిష్కారం చూపిస్తారు. మీరు అడిగిన 30శాతం జీతాలు పెంచడం సాధ్యం కాకపోవచ్చు. మీరు పెంపు శాతం కాస్త తగ్గించుకోండి. నిర్మాతలు సైతం వారు చెప్పిన పర్సంటేజ్ కాకుండా కాస్త పెంచేలా దిల్ రాజు మాట్లడతారని మంత్రి చెప్పారు.
అయితే జీతాల పెంపు విషయంలో నిర్మాతల నుండి వ్యక్తమవుతున్న అభ్యతరాలను సైతం కార్మికులకు చెప్పారట మంత్రి కోమటి రెడ్డి. 24 క్రాఫ్ట్స్ లోని డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, కెమెరా మెన్ అండ్ కెమెరా అసిస్టెంట్స్ యూనిన్లకు మాత్రం జీతాల పెంపుపై నిర్మాతలు తీవ్ర స్దాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా కార్మికులతో మంత్రి చెప్పారట. ఇప్పటికే కార్మికులకు 15శాతం వెంటనే జీతాల పెంపుకు సినీ నిర్మాతలు అంగీకరించడంతోపాటు, ఏడాదికి 5శాతం పెంచుతామంటూ చెప్పారు. నిర్మాతల నిర్ణయంపై కార్మికులు ఒప్పుకోకపోవడంతో ఇన్నాళ్లు సమ్మె సాగుతూవస్తోంది. తాాగాజా కోమటి రెడ్డి జోక్యంతో నిర్మాత దిల్ రాజు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.
రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం..
అటు నిర్మాతలు నష్టపోకుండా, ఇటు కార్మికులు నొచ్చుకోకుండా జీతాల పెంపుపై ఒకటి ,లేదా రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కార్మికులతో మంత్రి మాట్లడుతూ సీఎం రేవంత్ రెడ్డికి సమావేశంలో జరిగిన అంశాలను వివరిస్తానని చెప్పారట. కార్మికుల సమ్మె ,జరుగుతున్న పరిణామాలపై సీఎం సీరియస్ గా ఉన్నారని, ఇంకా సమ్మె ఎక్కువ కాలం జరగడం భావ్యం కాదని , వెంటనే సమస్య సర్దుబాటు చేయాలని తనను ఆదేశించనట్లుగా మంత్రి కార్మికులతో అన్నారు.
మంత్రి జోక్యంతో సినీ కార్మికుల జీతాలు 20శాతం వెంటనే, ఏడాదికి పదిశాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు అసంతృప్తిగా ఉన్న ఆ మూడు విభాగాలకు మాత్రం ఆశించిన స్దాయిలో జీతాలు పెరిగే అవకాశాలు లేవనే టాక్ నడుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ నేతలు ఇండస్ట్రీలో సమ్మె , ఆ తరువాత పరిణామాలను మంత్రికి తెలిజేశారు. ఈ సదర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ , సినీ కార్మికులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు , విశ్వప్రసాద్ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. న్యాయంగా మా జీతాల కోసం మేం సమ్మె చేస్తుంటే , మా కార్మికులను కూడా నిర్మాతులు మాదిరిగా రెండు గ్రూపులుగా విభజించి , మాలో మాకు విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారట కార్మికసంఘ నేతలు.