Rajiv Ratan: తెలంగాణలో విజిలెన్స్ డీజీగా ఉన్న సీనియర్‌ అధికారి రాజీవ్ రతన్ ఈ ఉదయం హఠాత్‌గా మరణించారు. ఉదయం గుండె పోటు వచ్చిందని ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజీవ్‌ రతన్ వివిధ విభాగాల్లో పని చేసి గుర్తింపు పొందారు. 


రాజీవ్‌ రతన్ ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం తీవ్ర గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 IPS  బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్​ విచారణను ఆయనే లీడ్ చేశారు.  గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా కూడా సేవలు అందించారు. 



రాజీవ్ రతన మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.