CM KCR: దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు జరగనున్న ఏ రోజు కారోజు రోజువారీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి ప్రత్యేకంగా చెప్పారు. మంత్రులు, శాసనస భ్యులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. 



  • జూన్ 2వ తేదీ - ప్రారంభోత్సవం


సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో పతాకావిష్కరణ చేస్తారు. ఉత్సవాలను ఉద్దేశించిన సీఎం కేసీఆర్ సందేశిస్తారు. అలాగే జిల్లాల్లో మంత్రివర్యుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం కూడా జరుగుతుంది.



  • జూన్ 3వ తేదీ – తెలంగాణ రైతు దినోత్సవం


రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం నిర్వహిస్తారు. సమావేశాలను జాతీయ గీతాలపనతో ప్రారంభిస్తారు. సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు,PACS చైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు అందరూ పాల్గొంటారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కరపత్రం, బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రిని తయారు చేసి, కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి. వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. రైతులందరితో సామూహిక భోజనం చేస్తారు.



  • జూన్ 4వ తేదీ – సురక్షా దినోత్సవం 


రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై పెట్రోలింగ్ కార్స్, బ్లూ కాల్ట్స్ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వారంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అంబేద్కర్ విగ్రహం ముందు పోలీస్ బ్యాండ్లతో ప్రదర్శన కూడా చేస్తారు. సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభ నిర్వహిస్తారు. 



  • జూన్ 5వ తేదీ –  తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం:


నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరిస్తారు. సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్రం గత 9 ఏండ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి, సీఎండీ జెన్ కో, ట్రాన్స్ కో, స్పెషల్ సీఎస్ ఎనర్జీ, మొత్తం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర విద్యుత్ వినియోగదారులు పాల్గొంటారు.



  • జూన్ 6వ తేదీ – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం


పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి. ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి. రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి. పాంప్లెట్లు ప్రచురించి, పంచాలి. టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి.  ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి. 



  • జూన్ 7వ తేదీ – సాగునీటి దినోత్సవం..


కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఈ డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ జరపాలి. ఈ సభలో రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి. అలాగే రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది.  పుస్తకాల ఆవిష్కరణ, ప్రసంగాలు. తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. 



  • జూన్ 8వ తేదీ – ఊరూరాచెరువుల పండుగ..


గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి. గ్రామంలోని రైతులు, మత్స్య కారులు, మహిళలుఅన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి.  కట్ట మైసమ్మపూజ – చెరువు నీటికి పూజ చేయాలి. తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు – బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి. ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్బ జలాల పెరుగుదల.. తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి – పాంప్లెట్లు పంచాలి – చదివి వినిపించాలి. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేయాలి.  ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, తదితరులు పాల్గొంటారు. 



  • జూన్ 9 - తెలంగాణ సంక్షేమ సంబురాలు..


నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి. తాము పొందిన లబ్ధి గురించి, లబ్ధిదారుల చేత మాట్లాడించాలి.  తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో ఒక సభ నిర్వహించాలి. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలి. వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం. 



  • జూన్ 10వ తేదీ - తెలంగాణ సుపరిపాలన దినోత్సవం - పరిపాలన సంస్కరణలు, ఫలితాలు


అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి. నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.  



  • జూన్ 11వ తేదీ -  తెలంగాణ సాహిత్య దినోత్సవం - రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు


రవీంద్రభారతిలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి. రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కూడా ఒక కవితా సంకలనాన్ని ప్రచురించాలి. 



  • జూన్ 12వ తేదీ – తెలంగాణ రన్ 


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి. ఈ రన్ కార్యక్రమం పోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది. క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి. 



  • జూన్ 13 - మహిళా సంక్షఏమ దినోత్సవం


నియోజకవర్గం కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగుణులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలన్నింటిని ఘనంగా పేర్కొనాలి.



  • జూన్ 14వ తేదీ - తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం


హైదరాబాద్ లోని నిమ్స్ లో నూతనంగా ప్రభుత్వం తలపెట్టిన 2000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంఖుస్థాపన చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి. ఇందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి. 33 మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్ లు, మాతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి పూర్తి వివరాల గురించి వివరించాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి. ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి. అవార్డులు అందించాలి.



  • జూన్15వ తేదీ - తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం


ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగుర వేయాలి. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. గ్రామ పారిశుద్ద్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి. నాడు – నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేయాలి.



  • జూన్ 16వ తేదీ  - తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం


వివిధ పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం గురించి, డంప్ యార్డుల గురించి, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, 10శాతం గ్రీన్ బడ్జెట్ గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలి. జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి. ఉత్తమ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.



  • జూన్ 17వ తేదీ – తెలంగాణ గిరిజనోత్సవం


ఆయా గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించాలి. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చర్చించుకోవాలి. గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.



  • జూన్ 18వ తేదీ  - తెలంగాణ మంచి నీళ్ల పండుగ


ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలి. నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును వివరించాలి. ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న తీరును వివరించాలి. రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహించాలి. ఇందులో సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొనాలి. మిషన్ భగీరథ విజయాలను విశేషంగా తెలియజేయాలి.



  • జూన్ 19వ తేదీ  -  తెలంగాణ హరితోత్సవం


రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి.మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి. గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.



  • జూన్ 20వ తేదీ  - తెలంగాణ విద్యాదినోత్సవం


రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పేర్కొనాలి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలి.సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించాలి. పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.



  • జూన్ 21వ తేదీ  - తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం


దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలకు అలంకరణలు చేయాలి. అలాగే దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టాలి. ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు. హరికథలు, పురాణ ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనాలి.



  • జూన్ 22వ తేదీ  - అమరుల సంస్మరణ


ఊరూరా గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలి. అమరులసంస్మరణ తీర్మానం చేయాలి. ఇదే విధంగారాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలి. నిర్ణీత ఫార్మాట్ లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలి. హైదరాబాద్లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ నుంచి 6 వేల మందికి తగ్గకుండా, కళాకారులతో భారీ ర్యాలీ -ముఖ్యమంత్రి గారిచే అమరవీరుల స్మారకం ప్రారంభించడం జరుగుతుంది. కళాకారుల ర్యాలీని సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది.