KCR in Praja Ashirvada Sabha: హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప‌టాన్‌ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డికి మ‌ద్దతుగా ప్రసంగించారు. భవిష్యత్తులో ఇస్నాపూర్ వ‌ర‌కు మెట్రో వ‌స్తుంద‌ని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు కూడా మెట్రో వ‌స్తుందని, దీంతో ప‌టాన్‌ చెరు ద‌శే మారిపోతుందని కేసీఆర్ చెప్పారు. పరిశ్రమలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ హాయంలో నీరంతా కలుషితంగా ఉండేదని, స్థానికులు అవే తాగాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఎన్నో జబ్బుల బారిన పడిన సందర్భాలు ఉండేవని, చర్మ వ్యాధులు కూడా వచ్చేవని అన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ప్రతి రోజు ప‌రిశుభ్రమైన నీళ్లు అందిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో కార్మికుల అవ‌స‌రాల కోసం 350 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి శంకుస్థాప‌నం చేశామని చెప్పారు.


వంట మీది, మేం వడ్డిస్తాం..
అంతకుముందు మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరు మీరు వంట చేసి పెట్టండి.. మేం వడ్డిస్తామన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రంలో సంపద పెరిగేలా చూశామని, కానీ దానిని కాంగ్రెస్ తుంచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ త్వరలో పైప్ లైన్ రానుందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్య కూడా తీరబోతుందని చెప్పారు.


కందుకూరులో మెడికల్ కాలేజీ రావడానికి, నాలాల అభివృద్ధి జరగడానికి సబితా ఇంద్రారెడ్డి ఎంతో పని చేశారని అన్నారు. ఆమె ఒక మంత్రి అనే గర్వం ఆమెలో అస్సలు ఉండబోదని అన్నారు. ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 


హుజూరాబాద్‌లో..
హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గంలో ప్రజా ఆశీర్వాద సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. ఇక్కడ ఒకే విడత‌లో ద‌ళిత‌బంధు అమ‌లు చేశామ‌ని, ఇప్పుడు అక్క‌డ ద‌ళిత వాడ‌.. దొర‌ల వాడ‌గా మారిందని కేసీఆర్ అన్నారు. దళిత సమాజం అణిచివేత‌కు, వివ‌క్ష‌కు గురైందని, కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ వారిని పట్టించుకోని ఉంటే పేద‌రికం ఉండేది కాదని అన్నారు.