తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులుగా నిలిచిన వారి స్మారకార్థం ప్రభుత్వం నిర్మించిన స్మారక స్తూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నడి మధ్యలో హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయానికి ఎదురుగా ఈ స్మారక చిహ్నాన్ని వెలుగుతున్న దీపం ఆకారంలో నిర్మించారు. గురువారం (జూన్ 22) సాయంత్రం ఈ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ప్రాంరభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు తుపాకులతో సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ు అర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. వెంటనే అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. తర్వాత అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన లఘుచిత్రాన్ని లోపల ఏర్పాటు చేసిన మినీ ఆడిటోరియంలో తిలకించారు. 


అక్కడి నుంచి పక్కనే ఉన్న సచివాలయ ప్రాంగణానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళిగా కేసీఆర్ ఎలక్ట్రిక్ కొవ్వొత్తులను ప్రదర్శించారు. సీఎంతో పాటు మంత్రులు, సీఎస్, ప్రజా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ కొవ్వొత్తులను ప్రదర్శించారు. అనంతరం రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యులను కేసీఆర్ సన్మానించారు.


వచ్చుడో.. సచ్చుడో అని బయలుదేరాం - సీఎం కేసీఆర్


అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పర్యటనకు లీడర్లు సహా విదేశీ ప్రతినిధులు ఎవరూ వచ్చినా సరే ముందు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించేలా చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపేలా సాంప్రదాయం తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తనలో సంతోషం ఒక పాలు, విషాదం రెండు పాళ్లు ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో కార్యాచరణ కోసం తాము పిడికెడు మంది కలిసి ఐదారు గంటల పాటు చర్చలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. 1966లో ఖమ్మం నుంచి ఆజన్మ తెలంగాణ వాది అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. అనేక అపవాదులు, హింస, పోలీసుల కాల్పులు ఎన్నో తెలంగాణ చరిత్రలో ఉన్నాయని అన్నారు.


తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు జలదృశ్యం సమీపంలో ఉంటే అప్పటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి సామాన్లు బయట పెట్టించి వెళ్లగొట్టిందని గుర్తు చేశారు. అందుకే పట్టుబట్టి, అదే ప్రదేశంలో అమరవీరుల స్తూపం నిర్మించాలని సంకల్పించామని అన్నారు.


తెలంగాణ కోసం తాము, తమ పార్టీ నేతలు ఎన్నోసార్లు రాజీనామాలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యే, మంత్రి పదవులుకు రాజీనామా చేశామని చెప్పారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని, కానీ భావోద్వేగాలు పిల్లల్ని ఆపలేకపోయాయని అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు తనపై చేసిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపైన కూడా జరిగి ఉండదని చెప్పారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని గుర్తు చేసుకున్నారు.


అంతకుముందు సభలో దాదాపు 10 వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతర ప్రజా ప్రతినిథులు అందరూ కొవ్వొత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానించారు.