వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారును మళ్లీ గెలిపిస్తే హైదరాబాద్ మెట్రోను పటాన్ చెరు వరకూ పొడిగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అటు హయత్ నగర్ కు కూడా మెట్రో నిర్మిస్తామని చెప్పారు. దీంతో వచ్చే ఐదేళ్లలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ కట్టనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునాదిరాయి వేశారు.
వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే ఆమోదించుకుందాం - కేసీఆర్
మెట్రో రైలు వ్యవస్థ సంగారెడ్డికి కూడా రావాలంటున్నారని, తప్పనిసరిగా రావాలని కేసీఆర్ అన్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి కూడా మెట్రో రైలు రావాలని కోరారని అన్నారు. అక్కడే ఆ సభలోనే తాను చెప్పానని అన్నారు. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే పటాన్‌చెరు టూ దిల్‌సుఖ్‌నగర్, పటాన్ చెరువు టూ హయత్ నగర్ వరకు మెట్రోరావాల్సి ఉందని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుందని చెప్పారు. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రో రైలుకు మంజూరు చేసుకుందామని చెప్పారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నానని అన్నారు.
‘‘పటాన్ చెరు ప్రాంతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో పటాన్‌చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారు. కానీ, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం 3 షిప్టుల్లో నడుస్తున్నాయి. పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్ని కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్, గృహాలకు, కమర్షియల్, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ. గతంలో ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపోయాం. 3.17 లక్షలతో పర్‌క్యాపిటా ఇన్‌కంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది.
పరిశ్రమల వల్ల ఇక్కడ కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ కు నలువైపులా 5 పెద్ద ఆస్పత్రులు తీసుకొచ్చే క్రమంలో భాగంగా పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తోంది. ఇందుకోసం రాజీవ్ శర్మ కృషి ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.
భూముల ధరలు పెరిగాయి - కేసీఆర్
పటాన్ చెరులో నివాస కాలనీలు బాగా పెరుగుతున్నాయని, ఇక్కడికి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు అనేవారని, భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని, ఏపీలో పడిపోయాయని చెప్పారు. ఇక్కడ ఎకరం అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు కొంటున్నారని చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు.