Hyderabad Crime News: హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం రోజు మొత్తం ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు, మరో ఇద్దరు నిరాశ్రయులు. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు ఇద్దరు టాన్స్ జెండర్లు దారణ హత్యకు గురయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అలాగే ఘటనా స్థలంలో హత్యకు వాడిన కత్తులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ట్రాన్స్ జెండర్లు ఇద్దరిలో ఒకరు 25, మరొకరు 30 సంవత్సరాల వయసు గల వారని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతులకు హత్య చేసిన నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.  


ఫుట్‌ పాత్‌ పై ఆశ్రయం పొందుతున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సీరియల్ సైకో కిల్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసి హతమారుస్తున్నట్టు తేల్చారు. సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా సైకో కిల్లర్‌ను పట్టుకున్నారు. నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్ లో మూడు హత్యలు చేశాడీ సైకో. 


నిన్నటికి నిన్న పెళ్లికి నో చెప్పిందని యువతి గొంతుకోసిన వ్యక్తి


పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 22 ఏళ్ల వాసవి సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ గచ్చిబౌలిలోని హాస్టల్‌లో నివసిస్తోంది. ఆమె సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన 27 ఏళ్ల కొత్త గణేష్ గచ్చిబౌలిలోని ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్ గా పని చేస్తున్నాడు. వాసవిని పెళ్లి చేసుకోవాలని గతంలో గణేష్ ప్రతిపాదించగా.. ఆమె తిరస్కరించింది. మంగళవారం రోజు రాత్రి వాసవి హాస్టల్ లో ఉండగా... ఆమెను పిలిచి బైక్ పై ఓ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. మరోసారి గణేష్ తన ప్రేమ సంగతి చెప్పాడు. పెళ్లి చేసుకుందామని  ప్రతిపాదన తీసుకు వచ్చాడు. మళ్లీ వాసవి నో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గణేష్ తన బ్యాగులోని కత్తి తీసి వాసవిపై దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతుతోపాటు ముఖం, చేతులపైన వేటు వేశాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా... నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని ఇలా ఆస్పత్రి పాలు చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.