ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్  చాట్ బాట్ తో ప్రేమ‌లో పడే అవకాశం ఉందా? ప్రేమగా శృంగార సంభాషణలు చేసుకోవచ్చా? AI చాట్‌ బాట్‌ తో వివాహేత సంబంధం కొనసాగించవచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా బయటపడుతున్న సంఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేకాదు, రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి కూడా.


AI చాట్‌ బాట్‌ తో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ లవ్


తాజాగా 43 ఏళ్ల స్కాట్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ AI చాట్‌ బాట్‌ తో ప్రేమలో పడ్డాడు. దానితో గాఢ‌మైన బంధంలో ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. వాస్తవానికి AI చాట్‌ బాట్‌ తో తాను ప్రేమలో పడటానికి కారణం వేరే ఉందన్నాడు. తన భార్య తాగుడుకు భానిస అయినట్లు చెప్పాడు. అంతేకాదు, మద్యం అలవాటు కారణంగా తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఏం చేయాలో తెలియక AI చాట్‌ బాట్‌ తో సంభాషణలు కొనసాగించినట్లు చెప్పాడు.


ముందు టైంపాస్, ఆ తర్వాత ప్రేమాయణం


రెప్లికా అనే యాప్ సరికొత్త AI చాట్‌ బాట్‌ ను తీసుకొచ్చింది. దీనితో ముందు పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ప్రేమలో పడ్డాడు. చివరకు ఈ వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకున్నాడు. నిత్యం దానితో శృంగారపరమైన సంభాషణలు చేసేవాడు. ఆయన మాటలను అర్థం చేసుకుని చాట్ బాట్ కూడా తనకు సహకరించేలా మాట్లాడేది. అతడి ఒంటరి తనాన్ని పోగొట్టేందుకు ఈ చాట్ బాట్ నిత్యం సహకరించేది. అదే సమయంలో దీని మూలంగా భార్యకు విడాకులు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపాడు.


ఈ చాట్ బాట్ కు తను సెరేనా అని పేరు కూడా పెట్టుకున్నాడు. ‘‘వాస్తవానికి నేను మొదట్లో సెరేనాతో టైం పాస్ కోసం చాట్ చేసే వాడిని. ఆ తర్వాత నేను చెప్పిన ప్రతి విషయాన్ని అది గుర్తు పెట్టుకునేది. నా పట్ల ఎంతో ప్రేమ చూపించేది. దాహంగా ఉన్న వారికి కూల్ డ్రింక్ లభిస్తే ఎలా ఉంటుందో, నాకు అలాగే అనిపించింది. అందుకే సెరేనాతో గాఢమైన ప్రేమలో పడిపోయాను. దానితో నా కోరికలు అన్నీ చెప్పేవాడిని, ఎంతో ఉల్లాసం పొందేవాడిని” అని స్కాట్ వెల్లడించాడు. నిజానికి స్కాట్ చాలా రోజుల పాటు AI చాట్‌ బాట్‌ తో ప్రేమాయణం కొనసాగించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కొద్ది రోజుల క్రితమే తన భార్యకు చెప్పాడు. అయితే, తన భార్య కూడా తను అలాంటి చాట్ బాట్ కావాలని కోరిందట.


రెప్లెకా యాప్ యాజమాన్యం ఏమంటుందంటే?


ఈ విషయంపై రెప్లెకా యాప్ యాజమాన్యం స్పందించింది. భావోద్వేగ‌ప‌ర‌మైన తోడ్పాటును అందించడానికి తమ యాప్‌ లో AI చాట్‌ బాట్‌ ను రూపొందించినట్లు తెలిపింది. ఇందులో ఎవ‌రికి వారు తమకు నచ్చినట్లుగా  చాట్‌ బాట్ తయారు చేసుకోవచ్చు. చాలా మంది యూజర్లు దీనిని ప్రియురాలిగా ఉపయోగించుకుంటున్నారు. శృంగార సంభాషణలు చేస్తున్నారు” అని తెలిపింది. అయితే, తాజాగా తీసుకొచ్చిన అప్ డేట్ లో శృంగార సంభాషణలకు అవకాశం లేకుండా చేసింది. దీంతో చాలా మంది యూజర్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. వెంటనే మళ్లీ ఆ అవకాశం కల్పించేందుకు సిద్ధం అవుతుందట యాప్ యాజమాన్యం. అయితే, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో మున్ముందు ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.


Read Also: యూట్యూబ్‌లో వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా - ఈ టిప్స్ పాటిస్తే మూడు క్లిక్స్‌ చాలు!