BRS Party: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈనెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు పనులను సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు తాజాగా పరిశీలించారు.


ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, రాములు, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కకడి నుంచి తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో చర్చించారు. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. 


శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో యాగాలు..


అయితే మంగళ, బుధ వారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మూడు రోజులుగా.. యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరి పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సంతోష్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. 


450 మందికి పైగా ప్రతినిధులతో కార్యక్రమం..


మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు.. అందుకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫర్మిచర్ ను ఇప్పటికే అక్కడికి చేర్చారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మిగిలిన ఆహ్వానితులు సమయానికి వెళ్లనున్నారు. 


ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం..


అలాగే పార్టీ ప్రారంభోత్సవానికి డేడీఎస్ అధ్యక్షుజు కుమార స్వామితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిళేష్ యాదవ్, బిహీర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటులు ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులను ఆహ్వానించారు. నెల 14వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తారు. అదే రోజు మధ్యాహ్నం జాతీయ మీడియాతో జరిగే భేటీలో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని వివరించనున్నారు.