తెలంగాణలో డాక్టర్ల నియామకం పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇంత మందికి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటిసారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం బలోపేతం కావడమే కాకుండా దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న శిల్ప కళా వేదికలో ఇటీవల నియామకమైన డాక్టర్ల పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. నూతన డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన  నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులను అభినందించారు. తాజాగా నియమితులైన డాక్టర్లు (సివిల్ అసిస్టెంట్ సర్జన్స్) ట్రాన్స్‌ఫర్ కోసం పైరవీలకు రావొద్దని, కనీసం రెండు మూడేళ్లు పోస్టింగ్‌ ఇచ్చిన చోటే పనిచేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మెరుగ్గా పనిచేసి పేదలకు తమ వంతుగా మంచి సేవలందిస్తే కౌన్సిలింగ్‌లో వెయిటేజీ కల్పిస్తామని‌ చెప్పారు. మొత్తం 929 మంది వైద్యులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు.


సమాజ సేవకు వైద్యులను పంపిన వారి తల్లిదండ్రులు, గురువులకు మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తెలియజేశారు. తల్లి మన అందరికీ జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మ ప్రసాదిస్తారని అన్నారు. తల్లి తరువాత ఓ జీవికి ప్రాణం పోసే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందన్నారు. కరోనా కష్ట కాలంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో పని చేసిన వారికి వెయిటేజీ కల్పించామని మంత్రి హరీష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు పీజీలో కూడా వెయిటేజీ కల్పించినట్లు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేత మహంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734, వైద్య విధానపరిషత్‌లో 209, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 పోస్టులున్నాయి. వీరికి విభాగాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పోస్టులకు రోజుకు 250 మంది చొప్పున 3 రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఒక రోజులో కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు. పోస్టుల ఖాళీల సమాచారాన్ని ముందస్తుగానే అభ్యర్థులకు వెల్లడించి, అందుబాటులో ఉన్న ఖాళీల్లో పోస్టింగ్ ఇస్తారు. మొత్తం 4,800 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులను గుర్తించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను డిసెంబరు 19న వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ విడుదల చేసింది. 


వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబరు 30) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ మెడికల్‌హెల్త్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.