Revanth Reddy Reviews over TSPSC: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒక్కో శాఖపై రివ్యూ చేస్తూ వస్తున్నారు. రోజూ వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) పైన కూడా నేడు (డిసెంబర్ 12) సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. కొద్ది నెలల క్రితం టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపర్లు లీకైన అంశానికి సంబంధించిన వివరాలు, వాటిపై నమోదైన కేసుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాటు.. ఛైర్మన్‌ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు.


ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును రీసెర్చ్ చేసి సవివరమైన రిపోర్ట్ అందజేయాల్సిందిగా రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గ దర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కావాల్సిన సిబ్బందిని వెంటనే కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఇప్పటి దాకా చేపట్టిన ఉద్యోగ నియామకాలు, ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల స్థితి, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై రేవంత్ రెడ్డి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రూప్‌ - 1, ఏఈఈ లాంటి పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడంపై కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర పరీక్షల డేట్లు, ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్‌ తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసులు ఉన్నతాధికారులు, కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. 


సచివాలయంలో విద్యా శాఖపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఉండేలా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.