KCR Video from Yashoda Hospital: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆస్పత్రి ఎదుట రద్దీ నెలకొనడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. తన కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం వల్ల తాను గాయపడ్డానని అన్నారు. అంత మందిని లోనికి అనుమతిస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారని అన్నారు. అందుకని అందరూ క్షేమంగా తమ ఇళ్లకు క్షేమంగా వెళ్లిపోవాలని కోరారు. అభిమానానికి వేయి చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. 


‘‘రేపటి నుంచి కనీసం ఇంకో 10 రోజుల వరకూ నా కోసం ఎవరి రావొద్దని నేను కోరుతున్నా. నాతో పాటు ఈ ఆస్పత్రిలో ఎంతో మంది పేషెంట్లు ఉన్నారు. కింద ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అన్యదా భావించకుండా అందరూ తిరిగి ఇంటికి చేరుకోండి. నేను కోలుకున్న తర్వాత నేను ఎలాగూ ప్రజల మధ్య ఉండేవాడినే కాబట్టి, మిమ్మల్ని కలుస్తాను. ఆస్పత్రిలో ఉన్న కేటీఆర్, హరీశ్ రావు, అక్బరుద్దీన్ ఒవైసీ కూడా మీకు చెప్తారు. దయచేసి వారి మాట విని వెనుదిరిగి ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని కోరుతున్నా. ఆస్పత్రి వద్ద నాకు, ఇతర పేషంట్లకు, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా వెనుదిరిగి వెళ్లిపోవాలని కోరుతున్నాను. నా మాటను మన్నించి, గౌరవించి ఏ మాత్రం ఇబ్బంది చేయకుండా ఇంటికి తిరుగు ప్రయాణం కావాలని నా మనవి’’ అని కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు.