నందమూరి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌గా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణకు అభినందనలు తెలిపారు. అవుట్ లుక్ మ్యాగజైన్ దేశంలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ జాబితాను విడుదల చేయగా, అందులో బసవతారకం ఆస్పత్రి రెండో స్థానంలో నిలిచింది. 


ఈ సందర్భంగా చంద్రబాబు బసవతారకం ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను కొనియాడారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న, వృత్తిపరమైన, బాధితులకు చక్కటి సంరక్షణ, పేదలకు అధునాతన క్యాన్సర్ చికిత్సలు, థెరపీలను అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్‌ను తయారు చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి కృషిని నేను అభినందిస్తున్నానని అన్నారు.


‘‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి, యాజమాన్యం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. అవుట్ లుక్ మ్యాగజైన్ ద్వారా బసవతారకం హాస్పిటల్ భారతదేశంలోనే 2వ ఉత్తమ ఆంకాలజీ ఆసుపత్రిగా అవార్డు పొందడం ఆనందరకం. తక్కువ ఖర్చుతో కూడుకున్న, వృత్తిపరమైన, బాధితులకు చక్కటి సంరక్షణ, పేదలకు అధునాతన క్యాన్సర్ చికిత్సలు, థెరపీలను అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్‌ను తయారు చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి కృషిని నేను అభినందిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.






అవుట్ లుక్ మ్యాగజైన్ జారీ చేసిన బెస్ట్ క్యాన్సర్ ఆస్పత్రుల జాబితాలో మొదటి స్థానాన్ని ముంబయిలోని సర్ హరిక్రిష్ణదాస్ నరోత్తమ్ దాస్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిలిచింది. ఈ ఆస్పత్రిని స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం మెమోరియల్ గా నెలకొల్పిన సంగతి తెలిసిందే. 


మూడో స్థానంలో తమిళనాడు వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, నాలుగో స్థానంలో గ్లెనేగెల్స్ గ్లోబల్ హాస్పిటల్ (చెన్నై) ఉన్నాయి. కిమ్స్ హెల్త్ (తిరువనంతపురం), మీనాక్షీ మిషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (మధురై), ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (మంగళూరు), జాస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ముంబయి), బాంబే హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ముంబయి), రాజీవ్ గాంధీ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఢిల్లీ), లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ముంబయి), ఓమెగా హాస్పిటల్స్ (హైదరాబాద్), ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ (బెంగళూరు), అపోలో కాన్సర్ సెంటర్ (చెన్నై), మేదాంత - ది మెడిసిటీ (గురుగ్రామ్) తదితర ఆస్పత్రులు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.