Chalapathi Rao Death: సినీ నటుడు చలపతి రావు మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగం రెండు రోజుల్లోనే ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాధకరం అని అన్నారు. అలాగే చలపతిరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నటుడు చలపతి రావు కన్నుమూయడం బాధాకరం అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ గా తనదైన శైలి నటనను చూపించారని పవన్ కల్యాణ్ చెప్రుపుకొచ్చారు. సినీ పరిశ్రలో ఒక తరానికి చెందిన నటులంతా ఒక్కొక్కరుగా కన్నుమూయడం దురదృష్టకరం అని చెప్పారు.
నటుడు చలపతిరావు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన విలక్షణ నటనతో చలపతి రావు తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటులు అయ్యారని వివరించారు. ఆయన మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సీనియర్ నటుడు, నిర్మాత చలపతి రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. 1200 కు పైగా సినిమాల్లో నటించి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
గుండెపోటుతో మృతి చెందిన చలపతిరావు
టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. వయసు 78 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే గుండెపోటుతో చలపతిరావు చనిపోయారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని కుమారుడి ఇంట్లోనే ప్రస్తుతం చలపతి రావు ఉంటున్నారు. చలపతి రావు హఠాన్మరణంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చలపతి రావు కుమార్తెలు అమెరికాలో ఉంటుండడంతో వారు హైదరాబాద్‌కు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు రవిబాబు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం చలపతి రావు భౌతిక కాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం (డిసెంబరు 28) అంత్యక్రియలు నిర్వహిస్తామని రవిబాబు తెలిపారు.