Sankranti 2023 Special Buses: సంక్రాంతి పర్వ దినానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీ వాసుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 18 వందల బస్సులు నడపాలని చూస్తుండగా.. తాజాగా టీఎస్ఆర్టీసీ దాదాపు 15 వందల బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భాగ్య నగరం నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు బస్సులు తగ్గించిన ఆర్టీసీ.. ఈ ఏడు భారీగా బస్సులను పెంచుతోంది. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి 15 లక్షల మంది వరకూ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


జనవరి 6వ తేదీ నుంచి 14 వరకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోళు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ నుంచి నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణ కిషోర్ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రా వైపు వెళ్లే బస్సులను దిల్ సుఖ్ నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తోందని వివరించారు. అయితే రెండు ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు నిజానికి సరిపోవు. ఎక్కువ మంది రైళ్లలో వెళ్తుండగా, అంతకంటే ఎక్కువ మంది సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కొంత కాలంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు కార్లు, మినీ బస్సుల వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టీఎస్, ఏపీ ఆర్టీసీలు పండుగ స్పెషల్ బస్సుల్లో విధించే 50 శాతం అదనపు ఛార్జీని రద్దు చేశాయి. 


సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది.  మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని వివరించారు. 


‘‘జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నాం. గతంలో 30 రోజుల ముందు వరకూ మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది"అని వీసీ సజ్జనార్‌ చెప్పారు.