టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కేసులో మరో వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ ఛైర్మన్ మహబూబ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్ చెందిన కాలేజ్ నుంచే మాస్ కాపీయింగ్ జరిగినట్లు గుర్తించారు. 


పరీక్షకు హాజరు కాని అభ్యర్థుల పేపర్‌ని వాట్సాప్‌లో ఈ మహబూబ్‌ షేర్‌ చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ పేపర్‌ను ఇప్పటికే అరెస్టైన పూల రమేష్‌కు షేర్ చేసినట్టు గుర్తించారు. దీనికి ఆయన నుంచి 16 లక్షలు వసూలు చేశాడు మహబూబ్. 


డీఈగా ఉన్న పూల రమేష్‌కి తన కాలేజీ నుంచి పేపర్‌ని మహబూబ్‌ షేర్ చేశాడు. ఆ పేపర్‌ను రమేష్ పేపర్‌ని తాను బేరం కుదుర్చుకున్న 30 మందికి పంపించినట్టు సిట్ అధికారులు తేల్చారు. వారి నుంచి రమేష్‌ వసూళ్లకు పాల్పడినట్టు చెబుతున్నారు. హైటెక్ రీతిలో మాస్ కాపీయింగ్‌కు తెర తీసిన రమేష్‌... పేపర్‌ అమ్మడం ద్వారా భారీగానే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నట్టు తెలుస్తోంది. పేపర్‌ విక్రయించడం ద్వారా పది కోట్ల వరకు పోగేసినట్టు దర్యాప్తులో స్పష్టమైందని అంటున్నారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థి నుంచి అడ్వాన్సే కోటిన్నరపైగా తీసుకున్నట్టు చెబుతున్నారు.