డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిపోయిన తెలుగు నిర్మాత క్రిష్ణ ప్రసాద్ చౌదరిని విచారణ చేస్తుండగా పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆయన కస్టడీ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. కేపీ చౌదరి బయట పెట్టిన కొందరు సెలబ్రిటీల పేర్లను కూడా రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈయన ప్రముఖులతో పాటు, సెలబ్రిటీలకు కొకైన్ అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కింగ్‌ గాబ్రియల్‌తో సంబంధాలు, సినీ, రాజకీయ ప్రముఖుల్లో కొకైన్‌ కొనుగోలు చేసిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీశారు.


హైదరాబాద్‌, గోవాలో జరిగిన పార్టీల్లో సినీ సెలబ్రిటీలు మత్తు తీసుకున్నారా అనేవి పోలీసులు ఆరా తీశారు. ఎప్పటి నుంచి డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారనే అంశాలపై నిందితుడి నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత కేపీ చౌదరి సంచలన విషయాలు బయటపెట్టినట్టు పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు.


బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో నిందితుడు అనేక సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. బెజవాడ భరత్, తేజ, రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగోర్ ప్రసాద్, శ్వేత సహా పలువురి పేర్ల కేపీ చౌదరి మత్తు పదార్థాలు అమ్మాడని పోలీసులు గుర్తించారు. అషురెడ్డితో పాటు నటిమణులు జ్యోతి, సురేఖా వాణితో వందల కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. వీరితో కేపీ చౌదరి దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. స్నేహిత హిల్స్ లోని సిక్కీ రెడ్డి ఇంట్లో తరచూ పార్టీలు నిర్వహించేవాడని తెలుస్తోంది. 


12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ఆ 12 మందిలో సెలబ్రిటీలు, పలువురు యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి బ్యాంకు అకౌంట్ల వివరాలు, జరిగిన లావాదేవీలు కూడా పరిశీలించారు. 11 అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించాం. ‘‘బెజవాడ భరత్, తేజ, రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగోర్ ప్రసాద్, శ్వేత తదితరులు నా వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొన్నారు’’ అని కేపీ చౌదరి చెప్పినట్టు పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు.


జూన్ 13న అరెస్టు
డ్ర‌గ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌద‌రిని సైబరాబాద్ పోలీసులు జూన్ 13న అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డగ్స్ వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు.  


గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్‌ అవుతున్నట్టు గతంలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్‌ మూలాలను గుర్తించిన పోలీసులు.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial