ప్రవళ్లిక ఆత్మహత్యపై సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారం కారణంగా ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలుసున్నారు. ప్రవళ్లిక రాసిన సూసైడ్ నోట్ దొరికిందని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు. రిపోర్ట్ ఆదారంగా శివరాంపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శివరాం అనే వ్యక్తితో ప్రవళ్లిక ప్రేమలో ఉందని, కోస్గి మండలానికి శివరాంకు ఈ మధ్య మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్నారు. ఈ విషయం తెలిసి మనస్థాపం చెందిన  ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. నిన్న ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారని, ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. 


పరీక్షలతో సంబంధం లేదు


ప్రవళ్లిక మరణానికి,  పరీక్షల వాయిదాకి సంబంధం లేదన్నారు. ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక సూసైడ్ కు కారణమన్న డీసీపీ వెంకటేశ్వర్లు, శివరాం రాథోడ్ అనే యువకుడితో ప్రతి రోజు ఫోన్ కాల్ మాట్లాడేదన్నారు. నిన్న రాత్రి కూడా శివరాం రాథోడ్ తో మాట్లాడినట్లు, ఆమెతో పాటు రూంలో ఉన్న స్టూడెంట్లు తెలిపారని డీసీపీ వెల్లడించారు. 15 రోజుల క్రితమే హాస్టల్ లో చేరిందని, ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టం చేశారు. సూసైడ్ లేఖలో "అమ్మానాన్న నన్ను క్షమించడి. నా కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. ఫణి అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో" అని రాసినట్లు డీసీపీ తెలిపారు. 


ప్రభుత్వ హత్యేనంటున్న విపక్షాలు
ప్రవళికది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి.  విపక్షాల ఆరోపణలను బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ప్రవళిక వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు కాంగ్రెస్, బీజేపీ శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అటు ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని, అది ఆత్మహత్య కాదని అది హత్యే అని ఆరోపించారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేసి, ఒక నెలలో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తుందని, 2 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుందని హామీనిచ్చారు.


స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
అంతకుముందు ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రవల్లిక మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ బందోబస్తు మధ్య ప్రవల్లిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, మృతదేహాన్ని స్వగ్రామం వరంగల్ జిల్లాలోని బిక్కాజి పల్లికి తరలించారు. బిక్కాజిపల్లిలో ప్రవల్లిక అంత్యక్రియలు జరిగాయి. కొందరు ప్రవళిక ఆత్మహత్యను అదనుగా భావించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి, రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేశారనిపోలీసులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవళిక మరణాన్ని రాజకీయం చేయొద్దని పోలీసులు తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి లను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు.