ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ విమర్శలపై కౌంటర్ అటాక్ చేసింది కేంద్రం. దిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, పీయుష్ గోయల్... తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్లుగా చేస్తున్న సాయాన్ని లెక్కలతో వివరించారు.
ప్రకృతి వైపరీత్యాల సహాయనిధికి 8 ఏళ్లుగా దాదాపు 3,000 కోట్ల రూపాయాలను కేంద్రం జమ చేసిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 2018 నుంచి నేటి వరకు రూ. 1,500 కోట్లకుపైగా నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని తెలిపారు. 2018 నుంచి తెలంగాణకు ఎలాంటి విపత్తు సాయం చేయడం లేదన్నది పచ్చి అబద్దమని ఖండించారు. టీఆర్‌ఎస్ నాయకులు చేస్తుందని దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. 2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చిన టైంలో ఇప్పుడు గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు సాయం చేయేలేదన్న అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు.
విపత్తుల టైంలో వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. అప్పుడు కేంద్రం రూల్స్ ప్రకారమే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) ఫండ్స్‌తో సహాయక చర్యలు రాష్ట్రాలు తీసుకుంటాయన్నారు. తీవ్రమైన విపత్తు జరిగితే కేంద్ర బృందాలు సందర్శించి రూపొందించిన అంచనాల ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ నిధి(NDRF) నుంచి అదనపు నిధులు అందిస్తారన్నారు.
విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 46 ప్రకారం తీవ్రమైన విపత్తులు టైంలోనే SDRFలో సరిపడ నిధులు లేకుంటేనే అదనపు నిధులను కేటాయించడానికి కేంద్రానికి అధికారం ఉందన్నారు కిషన్ రెడ్డి. ప్రకృతి విపత్తులప్పుడు సహాయక చర్యలు సిద్ధం చేయడం, పునరుద్ధరణ, పునః నిర్మాణం, ఉపశమనానికి NDRF నుంచి నిధులు రావన్నారు. విపత్తు తీవ్రమైనప్పుడు మాత్రమే సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన ఖర్చు సహాయాన్ని కేంద్రం చేస్తుందన్నారు. రూల్స్ ప్రకారం ఒక్కో విభాగంలో జరిగిన నష్టం, అవసరమైన సాయం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక అందించాలన్నారు. ప్రాథమిక నివేదిక అందిన వెంటనే ఆ నష్టాన్ని అంచనావేయడానికి కేంద్ర బృందాలు పర్యటిస్తాయన్నారు.
2020లో హైదరాబాద్‌లో వరదల టైంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి 599 కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రు.449 కోట్లుగా తేల్చారు కిషన్ రెడ్డి. ఈ నిధులు రెండు విడతలుగా SDRFలో జమ చేసినట్టు వివరించారు. 2020-21లో తెలంగాణSDRFలో రూ.1,500 కోట్లకుపైగా నిధులు ఉన్నాయన్నారు. అందులో రూ. 1,200 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటా నిధులని తెలిపారు. వీటిని 2020లో హైదరాబాద్ లో వచ్చిన వరదల సహాయానికి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం చేయొచ్చన్నారు.
2021-22లో కూడా తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి(SDRF)కి రూ. 479.20 కోట్లు కేటాయించారని.. అందులో కేంద్రం వాటా రూ. 359.20 కోట్లని చెప్పారు కిషన్ రెడ్డి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రూ. 179.60 కోట్లు చొప్పున రెండు విడతలుగా నిధులను తెలంగాణSDRFకి జమ చేస్తున్నట్టు వివరించారు. 2014-15 నుంచి ఎనిమిదేళ్లుగా తెలంగాణకు విడుదల చేసిన SDRF & NDRF నిధుల మొత్తాన్ని వివరించారు.
2014-15 రూ. 172.41
2015-16 రూ. 673.70
2016-17 రూ. 544.16
2017-18 రూ. 58.40
2018-19 రూ. 226.50
2019-20 రూ. 487.50
2020-21 రూ. 449.00
2021-22 రూ. 359.20
2022-23 రూ. 377.60(విడుదల చేయాల్సి ఉంది)
మొత్తం నిధులు రూ.2970.87
గతంలో ఖర్చు పెట్టిన నిధులు ఆధారంగానే ఈ ఏడాదికి SDRFలో నిధులను కేంద్రం జమ చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన పత్రాలను, వార్షిక నివేదికలను అందించాల్సి ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ SDRFకు కేంద్రం వాటా నిధుల రూ. 377.60 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్రంలో గతే ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన పత్రాలు, నివేదికలు అందజేస్తే ఈ నిధులు జమ అవుతాయన్నారు.
తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు కిషన్ రెడ్డి. నిత్యం వరదలతో సతమతమయ్యే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2017 లో బిజెపి అధికారం చేపట్టినా ఇప్పటి వరకు పైసా కూడా NDRF నుంచి విడుదల చేయలేదన్నారు. దీనికి ఉన్న రూల్స్ ప్రకారమే నిధులు విడుదల ఉంటుందన్నారు. ఇకనైనా కేంద్రంపై అసత్యాలు ప్రచారం మానుకోవాలని సూచించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(KGBVs)లో 696 అంటే దాదాపు 15% విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. వీటికి అదనంగా 2022-23 విద్యా సంవత్సరంలో మరో 20 విద్యాలయాలను కేటాయించారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 విద్యాలయాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా 696 విద్యాలయాలు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.