GHMC Merger Cantonment: జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ విలీనంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాత్రమే కాకుండా దేశంలోని 56 కంటోన్మెంట్ లను స్థానిక సంస్థలలో కలపడం కోసం కేంద్రం ప్రక్రియ మొదలు పెట్టిందని వివరించారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి కేంద్ర డిఫెన్స్ శాఖ ఉత్తరం రాసిందని తెలిపారు. మిలటరీ ప్రాంతం కాకుండా సివిలియన్ ప్రాంతం జీహెచ్ఎంసీలో కలిపితే ఎలా ఉంటుందో చెప్పాలని ఆ ఉత్తరంలో పేర్కొన్నట్లు స్పష్టం చేశశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని.. అందుకోసమే ఓ ప్రత్యేక కమిటీని కూడా వేసిందని వివరించారు. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీతో సహా 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ రిపోర్టు తర్వాతే కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ విలీనంపై నిర్ణయం తీసుకోనుంది. విలీనానికి మద్దతు తెలుపుతూ గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల్లో పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సమర్పించనుంది. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ తో నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి వివరించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై కసరత్తు మొదలు పెట్టింది. కేంద్రం నిర్ణయంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబురాలు చేసుకున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అధికారులు అడ్డు పడుతున్నారని గతంలోనే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్... కంటోన్మెంట్ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు బంద్ చేస్తే, తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కార్వాన్ నియోజక వర్గంలో నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కంటోన్మెంట్‌లో అధికారులు చెక్ డ్యాం నిర్మించి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతుందని అన్నారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని మంత్రి అన్నారు. కంటోన్మెంట్, ఏఎస్ఐ రెండూ అడ్డు పడుతున్నాయని మంత్రి అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మంత్రి హితవు పలికారు.