Kukatpally Kidnap Case: హైదరాబాద్ లో 2015 సంవత్సరంలో సంచలన సృష్టించిన కూకట్ పల్లి బాలుడి కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎన్. ప్రవీణ్ కుమార్.. ఈథర్, హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలోనే గతంలో చేసిన కిడ్నాప్ కు సంబంధించిన అసలు విషయాన్ని ఇప్పటికి బయట పెట్టాడు. ఆ బాలుడిని తాము డబ్బుల కోసం కిడ్నాప్ చేయలేదని.. ఓ మహిళ కోసం కిడ్నాప్ చేశామని చెప్పాడు.
అసలేం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అలాగే ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా వారిద్దరూ దుబాయ్ లోనే సహజీవనం చేశారు. రెండేళ్ల తర్వాత సదరు మహిళ నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. కానీ ఇక్కడ బతకడం ఆమెకు కష్టమైంది. అందుకు ఆర్థిక సమస్యలే కారణం. అయితే మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు కూడా ఆమె దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో ఓ సరికొత్త నాటకానికి తెర తీసింది. దుబాయ్ లో సహజీవనం చేసిన వ్యక్తికి తాను గర్భిణీ అని తెలిపింది. నీ వల్లే నేను గర్భం దాల్చానంటూ నమ్మించింది. చికిత్స నిమిత్తం డబ్బు కావాలి, బాబు పోషణకు తనకు కావాలంటూ అతడి నుంచి నెలనెలా డబ్బులు వచ్చేలా చేసుకుంది. కానీ నిజానికి ఆమె గర్భమూ దాల్చలేదు, పిల్లాడిని కనలేదు. కానీ డబ్బుల కోసమే ఈ నాటకం ఆడింది. ఇలా దాదాపు ఆరేళ్లు గడిపేసింది. అతను ఇంకా డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు.
అయితే ఆరేళ్ల తర్వాత తాను దుబాయ్ నుంచి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. ముందుగా నిజామాబాద్ కు వస్తానని అన్నాడు. దీంతో మహిళ తీవ్రంగా భయపడిపోయింది. వెంటనే హైదరాబాద్ లో తనకు తెలిసిన ప్రవీణ్ కుమార్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. తనకు ఓ ఆరేళ్ల బాలుడి కావాలని, అందుకోసం ఎవరినైనా కిడ్నాప్ చేసి తీసుకురావాలని చెప్పింది. దీంతో ప్రవీణ్.. 2015 సంవత్సరం కూకట్ పల్లిలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లి సదరు మహిళకు అందజేశారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన బాలుడి తండ్రి కొద్ది రోజులు మహిళ వద్దే ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలుడి తమ కుమారుడి కాదని తెలుసుకున్నాడు. సదరు మహిళతో గొడవ పడి మంచిర్యాలకు వెళ్లిపోయాడు.
దీంతో బాలుడిని ఏం చేసుకోవాలో తెలియని మహిళ ప్రవీణ్ కు ఫోన్ చేసింది బాలుడిని వెంటనే తీసుకెళ్లాలని సూచించింది. నిజామాబాద్ కు చేరుకున్న ప్రవీణ్ బాలుడిని.. హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. నేరుగా ఇవ్వడం ఎందుకని భావించి.. బాలుడి నిజమైన తండ్రికి ఫోన్ చేశాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అప్పటికే బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్ చేసి ప్రవీణ్ ను పట్టుకున్నారు. ప్రవీణ్ తో పాటు ఆయనకు సాయం చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. అప్పట్లో పోలీసుల విచారణలో డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అసలు విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.