సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సింగరేణి సంస్థ సహకరించడం లేదని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం.  కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటీ చీఫ్ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు కోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. కార్మిక సంఘాల ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని పిటిషన్ లో ప్రస్తావించారు. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. 


యాజమాన్యం సహకరించడం లేదు
గత నెల 27న సమావేశం ఏర్పాటు చేస్తే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని, తుది ఓటరు జాబితాను కూడా సంస్థ ప్రకటించలేదని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ చేశామన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయ నిరాకరణతో ఎన్నికలపై ముందుకు వెళ్లలేకపోతున్నామని వెల్లడించారు. ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం న్యాయస్థానాన్ని కోరింది. ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని డివిజన్‌ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సింగరేణి సంస్థ అప్పీలుపై తదుపరి విచారణను, ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది.


ఎన్నికలు నిర్వహించవద్దని మొత్తుకున్నా...
సింగరేణిలో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు అన్ని సంఘాలు ఇప్పుడే ఎన్నికలు వద్దు అని మొత్తుకుంటున్నా.. కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణపై కార్మికశాఖ నిర్వహించిన సమావేశానికి 13 కార్మిక సంఘాలు గైర్హాజరై వ్యతిరేకించాయి. ఏకపక్షంగా కార్మికశాఖ ఎన్నికల తేదీని ఖరారు చేసిందని కార్మికులు మండిపడ్డారు. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. సింగరేణి పరిధిలో 15 కార్మిక సంఘాలుండగా.. 13 యూనియన్లు ఇప్పటికిప్పుడు గుర్తింపు ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతున్నాయి.


వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇక సింగరేణిలోని ప్రతి కార్మిక సంఘం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని, వాటిని వాయిదా వేయాలని ప్రధాన కార్మిక సంఘాలు కేంద్ర కార్మికశాఖకు విన్నవించాయి. ఈ విజ్ఞాపనలు వేటినీ అధికారులు పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేశాయి. సింగరేణి యాజమాన్యం మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతోంది.