Nandamuri Ramakrishna supports Chandrababu in AP Skill Development issue:
హైదరాబాద్: అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించలేకపోయారు, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదన్నారు నందమూరి రామకృష్ణ. తమకు కోర్టుల మీద నమ్మకం ఉందని, చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ అని నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ పాలన మళ్లీ రావాలన్నారు.


హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు చేపట్టిన ఈ దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ది సైకో పాలన అని, ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం అని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. దోచుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పాలన చేస్తున్నారని, పేద ప్రజలకు అన్నం ముద్ద పెట్టినోడు జైలుకు వెళ్లారని చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. దగా, మోసం జగన్ పాలన తీరని విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన బాటలో నడుస్తూ టీడీపీని, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన నేత చంద్రబాబు అని కొనియాడారు.


పేదలను పట్టించుకుంటూనే ఐటీ రంగాన్ని సైతం అభివృద్ధి చేసిన దార్శనికుడు చంద్రబాబు. స్కామ్ లేదు పాడు లేదు అన్నారు. ఆధారాలు లేకుండానే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. రిమాండ్ రిపోర్టులో సైతం వాస్తవాలు లేవని చెప్పారు. కోర్టులు సైతం ఆధారాలు అడుగుతున్నా ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఏవీ సమర్పించలేకపోయాయన్నారు. రూ.3000 కోట్ల నుంచి ఇప్పుడు రూ.371 కోట్లు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో స్కామ్ జరిగిందని చెబుతున్నారు. కానీ ఈరోజుకు సైతం ఇందులో అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. అంటే వారు చేస్తున్న ఆరోపణల్లో కూడా పస లేదని చెప్పుకొచ్చారు నందమూరి రామకృష్ణ. మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు. ఆయన కోరుకుంటే టాటా, బిర్లాల కంటే ఎక్కువ స్థాయికి వెళ్లేవారని.. కానీ తెలుగు ప్రజల కోసం జాతీయ పదవులకు వెళ్లని నేత చంద్రబాబు అని పేర్కొన్నారు.


చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు సోమవారం 
 టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు   తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ  సుప్రీంకోర్టులో సోమవారం జరగనుంది.  సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి.  ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ.. ఇరువురు న్యాయవాదుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయి.