Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు అంచనాలకు అందని, ఎవరూ ఊహించని విధంగా తీర్చిదిద్దబోతున్నారు. 162 కిలోమీటర్‌ పొడవుతో నిర్మించి ఈ ఫోర్‌లేన్ రహదారికి రూ.8,500 కోట్లు అవుతుందని నేషనల్ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఇదే విషయాన్ని డీపీఆర్లో పేర్కొంది. ఈ రహదారి నదులు, వాగులు వంకలు మీదుగా వేయాల్సి ఉంది. ముఖ్యంగా మూడు నదులపై భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీని కోసమే 250 కోట్లపైగా ఖర్చు పెట్టబోతున్నారు.


భవిష్యత్‌లో 8 లేన్లు


త్రిపుల్ ఆర్‌ను భవిష్యత్‌లో ఎలాంటి విపత్తులు, జనభా పెరుగుదలనైనా తట్టుకునేలా నిర్మించబోతున్నారు. వాస్తవంగా దీన్ని ఎనిమిది రహదారులగా నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రస్తుతానికి ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్‌లకే పరిమితం అయ్యారు. అయితే భూసేకరణ మాత్రం భవిష్యత్‌లో ఎనిమిది లేన్లకు విస్తరించేలా చేపడుతున్నారు.


16.4 అడుగుల ఎత్తులో


గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు వస్తోంది. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అంతేకాకుండా రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ఇలాంటి సమస్య కొత్త నిర్మించబోయే రీజినల్ రింగ్‌రోడ్డుకు లేకుండా ఉండేలా చూస్తున్నారు. అందుకే ఎత్తులో రోడ్డు వేయనున్నారు. ఎంత అంటే 16.4 అడుగుల ఎత్తులో. దీనికి గట్టిగా ఖర్చు కానుంది.


3 వంతెనలపై బ్రిడ్జిల కోసమే 250కుపైగా కోట్లు


162 కిలోమీటర్ల రహదారి అనేక వాగులు వంకలు, నదుల మీదుగా వెళ్లనుంది. అందుకే అక్కడ కూడా భవిష్యత్‌లో సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. ఈ ఉత్తర భాగం ‌ట్రిపుల్ ఆర్‌ మూడు నదులను దాటుకుంటూ వెళ్లాలి. అందుకే ఆయా నదులపై నాలుగు వరుసల వంతనలు నిర్మిస్తారు. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద మూసీ నదిపై వంతెన నిర్మిస్తారు. దీని కోసం వంద కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మంజీరా నదిపై పుల్కల్‌ మండలం శివంపేట వద్ద మరో వంతెన నిర్మిస్తారు. దీనికి దాదాపు 70 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. హరిద్రా నదిపై తూప్రాన్‌ వద్ద 70 కోట్లు ఖర్చు పెట్టి వంతెన నిర్మిస్తారు.  


భారీ లారీలు వెళ్లేలా అండర్ పాస్‌లు


ఈ మూడు వంతెనలతోపాటు చిన్న వంతెనలు, అండర్‌పాస్‌లు ఉంటాయి. 190 వంతెనలు నిర్మిస్తారు. వందకుపైగా అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అండర్‌ పాస్‌ల నుంచి భారీ లారీలు వెళ్లేంత దారి ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో రోడ్డును దాదాపు ఆరు మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. వీటితోపాటు చిన్న చిన్న వాహనాలు వెళ్లేందుకు దాదాపు మరో  50కిపైగా కల్వర్ట్‌లు నిర్మిస్తారు.


120 కిలోమీటర్లతో రాకపోకలకు అవకాశం


వంతనలు, కల్వర్ట్‌లు, అండర్‌పాస్‌లు కోసమే 2వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రోడ్డు నాణ్యత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చినా తట్టుకునేలా రహదారిని వేయనున్నారు. ఇలా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకోనున్నారు కాబట్టే దీనికి ఎనిమిదవేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది.