Telangana Roads: హైదరాబాద్‌: తెలంగాణలో రోడ్లకు మహర్ధశ పట్టనుంది. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) చేపట్టాల్సిన 4 జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  తాజాగా ఆర్మూర్- జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల- మంచిర్యాల జాతీయ రహదారులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. అంతకుముందు మహబూబ్‌నగర్-గూడెబల్లూర్ హైవేకి సంబంధించిన టెండర్లను గత నెలలోనే ఆహ్వానించింది. ఈ నాలుగు రహదారులను ఎన్‌హెచ్‌ఏఐ మొత్తం 271 కి.మీ. మేర రూ. 10,034 కోట్లతో నిర్మించనుందని సమాచారం. 

Continues below advertisement


ఈ డిసెంబరులో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ పనులు ప్రారంభించేలా ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టనుంది. ఇందులో జగిత్యాల- మంచిర్యాల హైవేని ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించనున్నారు. మిగతా మూడింటిని హ్యామ్ (Hybrid Annuity Model) విధానంలో వేయనున్నారు. ఈ నాలుగు రహదారులకు పర్యావరణ, అటవీ, రైల్వే అనుమతులు పూర్తయ్యాయి. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తే వెంటనే పనులు మొదలవుతాయి.


జాతీయ రహదారుల వివరాలు..
-  మహబూబ్‌నగర్- గూడెబల్లూర్ జాతీయ రహదారి: 80 కి.మీ. మేర రూ. 2,662 కోట్లతో జాతీయ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం 465.7 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. 


-  ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి: 64 కి.మీ. మేర రూ. 2,338 కోట్లతో నిర్మించనున్నారు. ఇందుకు 288.3 హెక్టార్ల భూమి సేకరించనున్నారు.


-  జగిత్యాల- కరీంనగర్: 59 కి.మీ. నేషనల్ హైవేను రూ. 2,484 కోట్లతో నిర్మిస్తారు. ఇందుకు 306.7 హెక్టార్ల భూసేకరణ చేయాలి.


-  జగిత్యాల- మంచిర్యాల రహదారి: 68 కి.మీ. నేషనల్ హైవేను రూ. 2,550 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందుకుగానూ 317 హెక్టార్ల భూమి సేకరించాలి. 


6 లేన్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులు
ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తరభాగం పనుల సవరణ టెండర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దానిపై చర్యలు వేగవంతం చేయనుంది. గతంలో ఈపీసీ పద్ధతిలో ఈ పనుల కోసం టెండర్లు పిలవగా, ఈసారి హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టేలా టెండర్లు పిలుస్తారు. 2024 డిసెంబరులో సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161 కి.మీ. మేర 4 లేన్ల రహదారిని రూ. 7,104 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే ట్రాఫిక్ సర్వే, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీనిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయాలని  నిర్ణయించగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఊపింది. మొత్తం రూ. 15,627 కోట్లతో ఆరు లేన్లుగా ఆర్ఆర్ ఉత్తర భాగం అభివృద్ధి చేయనున్నారు.