Hyderabad News: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎడ్‌టెక్ కంపెనీ byte XL దాదాపు 5.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ.50 కోట్లు) ఫండింగ్ సాధించింది. byte XL  ఇండియాలో వేగంగా ఎదుగుతున్న ఎడ్‌టెక్ సంస్థ. కలారి కాపిటల్, మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్ ఈ నిధులు సమకూర్చాయి. టైర్ -2, టైర్ -3 నగరాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు తక్కువ ధరకే టెక్నాలజీ టూల్స్ ను అందించడానికి ఈ నిధులు సమకూర్చారు. ఈ పెట్టుబడిని కంపెనీ విస్తరణకు, కొత్త ప్రొడక్ట్, టూల్స్ నిర్మాణానికి వాడతారు. బైట్ ఎక్స్ఎల్ దేశవ్యాప్తంగా 26 ఇంజనీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. 


పరిశ్రమకు అవసరమైన మోడరన్ టెక్నాలజీని ఈ సంస్థ ద్వారా అందిస్తారు. ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలెప్‌మెంట్, క్లౌడ్ టెక్నాలజీలపై లక్ష మందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో అర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సును  ప్రారంభించారు.


byteXL  సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కరుణ్ తాడేపల్లి మాట్లాడుతూ.. తాము విద్యార్థులకు కేవలం కోడింగ్ మాత్రమే నేర్పడం లేదని.. చిన్న నగరాల్లో టెక్నాలజీ విద్యలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నామని చెప్పారు. రాబోయే ఇంజినీర్లు కొత్తతరం టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఈ ఫండింగ్ ఉపయోగపడుతుందన్నారు. 


ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌లో ఈ మధ్య కాలంలో బాగా మార్పులు వస్తున్నాయని కొత్త టెక్నాలజీలకు అవకాశం దొరుకుతోందని.. దీనివల్ల ఈ రంగంలో మార్కెట్ బాగా విస్తృతం అయిందని కలారీ కాపిటల్ పార్టనర్ సంపత్ అన్నారు. Michael & Susan Dell Foundation సీనియర్ డైరెక్టర్ సంజయ్ మోదీ మాట్లాడుతూ..  “byteXL  ఇండస్ట్రీకి.. విద్యావ్యవస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో తోడ్పతుందన్నారు. ఇది చిన్న నగరాల్లో ఉన్న విద్యార్థులను టెక్నాలజీ పరంగా శక్తివంతం చేస్తుందన్నారు.