Telangana News: పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్‌ను విష్‌ చేశారు. అంతే కాకుండా తన ఇంటికి ఎవరినైనా దర్యాప్తు అధికారులను పంపించవచ్చని సూచించారు. 


తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కీలక అరెస్టు ఖాయమంటూ గత కొన్ని రోజులుగా అధికార పార్టీ హెచ్చరికలు చేస్తోంది. దానికి ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దీటుగా సమాధానం చెబుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి మంత్రి పొంగులేటి అలాంటి కామెంట్స్ చేసారు. ఈసారి పేలబోయేది అణు బాంబు అని అన్నారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ మద్దతుదారులు కూడా వివిధ కేసులను తెరపైకి తీసుకొస్తూ కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అరెస్టు భయంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోతున్నారనే ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. 






అన్నింటికీ చెక్‌ పెడుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విష్ చేస్తూనే తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపిన స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. 


అంతే కాకుండా వచ్చిన దర్యాప్తు సంస్థ అధికారులకు చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కెట్లు ఇస్తామన్నారు. ఇవాళే వస్తే సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే కేక్‌ కూడా కట్ చేస్తామంటే కూడా తప్పిస్తానంటూ సెటైర్లు వేశారు.


ముఖ్యమంత్రి చేస్తున్న పాదయాత్రపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు.  ఈ టైంలో బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. " ముఖ్యమంత్రి చేస్తున్న మూసి పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారింది 


ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిర్బంధంలోకి తీసుకున్న మా పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి లను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము" అని ట్వీట్ చేశారు.  


గురవారం ప్రెస్‌మీట్ పెట్టిన కేటీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్ల రేస్‌పై వస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. అరెస్టు అయితే తాను సిద్ధమని అన్నారు. చేయని తప్పునకు తనను అరెస్టు చేస్తే హ్యాపీగా వెళ్లి జైల్లో కూర్చుంటానని.. అక్కడ యోగా చేస్తానని అన్నారు. నాలుగైదు నెలల తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర కూడా చేస్తానంటూ చెప్పుకొచ్చారు.