Padi Kaushik Reddy News: పోలీసులను దూషించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. తను దూషించారని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు పెట్టిన పోలీసులు ఈ ుదయం అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్‌లో పోలీసులను దూషించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రుబాబు చేశారని ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన్ని ఎప్పుడైనా అరెస్టుచేస్తారన్న అనుమానంతో బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇంకా బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నందున ఆయన్నే అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని పటిష్ట భద్రత మధ్య పోలీస్ వాహనంలో తరలించారు.
హరీష్‌రావుపై రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేతలు కొందరు విమర్శలు చేస్తుంటే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తన ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ తన ఫోన్ ట్యాప్ చేసి ట్రాక్ చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై ఫిర్యాదు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయనట్టు సిబ్బంది చెప్పారు. తనను మూడు గంటలకు రమ్మని చెప్పి వెళ్లిపోవడం ఏంటని సిబ్బందిపై ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి
ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు తీసుకోవాలని అక్కడే ఉన్న సీఐకి చెప్పారు. ఫిర్యాదు తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో కౌశిక్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఎవరో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారని... తను ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి స్టేషన్‌కు వచ్చి రుబాబు చేశారని బెదిరించారని ఆరోపిస్తూ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కౌశిక్‌రెడ్డిని A1గా చేస్తూ కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు మరో ఇరవై మందిపై కూడా కేసులు కట్టారు.
కౌశిక్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్, హరీష్ ఆగ్రహం
అక్రమ అరెస్టు, ప్రభుత్వ తీరు పట్ల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. రేవంత్‌రెడ్డీ నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది.' అని వార్నింగ్ ఇచ్చారు.
కౌశిక్ సహా ఇతర నేతల అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు." ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు ! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు ! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు ! ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు ! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు ! ప్రజలపై కేసులు ప్రజాప్రతినిధులపై కేసులు కేసులు .. కేసులు .. కేసులు కాసులు మీకు - కేసులు మాకు సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి" అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ...