BRS MLA Harish Rao Arrest News Today: మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్‌లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో కౌశిక్ రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లిన హరీష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్‌రావును అక్కడి నుంచి తరలించేందుకు అరెస్టు చేశారు.
ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తూ ట్రాక్ చేస్తోందని విమర్శించిన పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదంజరిగింది. ఫిర్యాదు చేయడానికి రమ్మని పిలిచిన పోలీసు అధికారి ఆ టైంలో లేకపోవడంపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి సిబ్బంది తన ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో వారిపై ఫైర్ అయిన కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్న ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా బెదిరించారని ఆరోపిస్తూ ఇన్‌స్పెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సంఘీభావం ప్రకటించేందుకు హరీష్‌రావుతోపాటు ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఆయన ఇంటికి వచ్చారు.
బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఎవర్నీ బయట వ్యక్తులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇంతలో మాజీ మంత్రి హరీష్‌రావు అక్కడకు వచ్చారు. తమ పార్టీ నేతను కలిసేందుకు అనుమతి ఎందుకు లేదని పోలీసులను ప్రశ్నించారు.
హరీష్‌రావు వచ్చిన తర్వాత ఆయన అనుచరులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అంతే కాకుండా మరికొందరు బీఆర్‌ఎస్ లీడర్లు కూడా కౌశిక్ రెడ్డికి ఇంటికి వస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన హరీష్‌రావు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో హరీష్‌రావు వాగ్వాదానికి దిగారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు.
హరీష్‌రావు తర్వాత మాజీ మంత్రి జగీదీష్ రెడ్డి సహా ఇతర సీనియర్ నేతలు కౌశిక్‌ను కలిసేందుకు వచ్చారు. వారిని కూడా పోలీసులు లోపలికి అనుతించలేదు. వారు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్బందులు వస్తాయని గ్రహించిన పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు.
అరెస్టులపై కేటీఆర్ ఫైర్
పార్టీ లీడర్ కౌశిక్ ఇంటికి వెళ్తున్నా కూడా పోలీసులు అరెస్టుచేయడం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు" ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు ! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు ! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు ! ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు ! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు ! ప్రజలపై కేసులు ప్రజాప్రతినిధులపై కేసులు కేసులు .. కేసులు .. కేసులు కాసులు మీకు - కేసులు మాకు సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.