Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. బుధవారం సీఎం, డిప్యూటీ చేసిన మహిళలపై చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాల్సిన ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కు నిరసనగానే ఇలా నల్లబ్యాడ్జీలతో సభకు హాజరైనట్టు సభ్యులు పేర్కొన్నారు.
మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని సభలో కూడా బీఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నారు మరోవైపూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌కు సభలో క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని గట్టిగా అరుస్తూ చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు తమక అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయినా స్పీకర్ వాళ్లకు అవకాశం ఇవ్వలేదు.
అసెంబ్లీ సమావేశాలు బుధవారం చాలా వాడీ వేడిగా సాగాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకలా సాగిన సమావేశాలు ఆ తర్వాత ఒక్కసారిగా వేడెక్కాయి. సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రస్తావించకుండానే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్‌లో అంటూ కేటీఆర్‌కు సలహా ఇవ్వడం వివాదానికి కారణమైంది. అయితే తాను ఎవరు పేరు ప్రస్తావించలేదని అనవసరంగా ఎవరికి వాళ్లే తమను ఉద్దేశించి అన్నారంటూ మొదట్లో చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి తననే టార్గెట్ చేశారని తనపై కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేశారని సభలో సబితా ఇంద్రారెడ్డి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు కూడా విమర్శల ఘాటు పెంచారు. 2019లో రేవంత్ రెడ్డికి ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. తనను ప్రతిపక్ష హోదా కోల్పోయేలా చేసింది సబితా ఇంద్రారెడ్డి కాదా అని ప్రశ్నించారు భట్టివిక్రమార్క. సీతక్క సహా సభ్యులంతా సబితాను టార్గెట్ చేశారు.
సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ సభ్యులు ఫైర్ అయ్యారు. అసలు మహిళా సభ్యులను కాంగ్రెస్ అవమానించదని ఆరోపించారు. సీఎం, డిప్యూటీ సీఎంకు మహిళలంటే గౌరవం లేదని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ గందరగోళం మధ్య ద్రవ్యవినిమయ బిల్లును సభ ఆమోదించుకుంది. అనంతర సభను స్పీకర్ వాయిదా వేశారు.
కాంగ్రెస్ నేతలకు మహిళలంటే గౌరవం లేదని ఆరోపిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం మహిళా సభ్యులకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. మిడియా పాయింట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాళ్ల వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రేవంత్, భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలు దహనం చేశారు.