కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. నిన్న (మార్చి 11) అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. ఇదే రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత ఈడీ విచారణ కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు ముందే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. 


హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున కొన్ని పోస్టర్లు అతికించగా, అందులో ఓ వైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు కనిపించాయి. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగబోదని, దానికి విరుద్ధంగా మరక నుంచి క్లీన్ అవుతారని ఈ పోస్టర్‌లో చూపించారు. హోర్డింగ్‌లో వాషింగ్‌ పౌడర్‌ నిర్మా.. వెల్‌కమ్‌ టూ అమిత్‌ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్‌ పెట్టారు. 


ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు రానుండడంతో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు.