Kontham Dileep : తెలంగాణా డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ బీఆర్‌ఎస్ ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ దిలీప్ కొణతంపై పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లోగో మారుస్తుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని కేసు నమోదు కాగా.. పూర్తి వివరాలు సమర్పించే వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోసారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్లు సమాచారం. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ఆగ్రహం
ఈ ఘటన పై బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తుంది. మాజీ డిజిటల్ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అంటోంది. గత కొంత కాలంగా దిలీప్ కొంత కాలంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దిలీప్‌ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. గత ఆరు నెలల నుంచి దిలీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో అక్రమ కేసు పెడితే... రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దిలీప్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే ఈరోజు పోలీసులు ఎలాంటి కారణం చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లారని... ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయని... మమ్మల్ని ఎలాంటి వివరాలు అడగవద్దని పోలీసులు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌పై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఖాకీలు దౌర్జన్యాలకు పాల్పడుతుందన్నారు. అక్రమంగా నిర్బంధించిన కొంతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు, పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు.
స్పందించిన కేటీఆర్
కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కొంతకాలంగా ప్రభుత్వ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు. నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’’. అని కేటీఆర్ పేర్కొన్నారు.
కఠిన చర్యలు తప్పవు
ఆగస్టు 31న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో గిరిజన మహిళపై లైంగికదాడి జరగడం సంచలనంగా మారింది. మహిళ తీవ్ర గాయాలతో ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహిళపై దాడికి నిరసనగా గిరిజన సంఘాలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకుని జైనూర్‌లో 144 సెక్షన్ అమలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: తెలంగాణలో ఆ రెండ్రోజులు సెలవులు - ప్రభుత్వం అధికారిక ప్రకటన