Just In





BRS leader Praveen Kumar : పేరుతోనే సమస్య, సునీల్ కుమార్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ సంచలన పోస్టు, ట్రిపుల్ ఆర్ బయట ఎలా ఉన్నారని ప్రశ్న
Andhra Pradesh News: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను వేధించడమే కాకుండా ఆర్థిక లావాదేవీల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ పై విచారణ సాగుతోంది.దీన్ని ఆర్‌ఎస్ ప్రవీణ్ తప్పుపట్టారు.

BRS leader Praveen Kumar support to IPS officer Sunil Kumar: ఆంధ్రప్రదేశ్‌లో ఐఎపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై కేసులు పెట్టడం, విచారణలు జరుపుతుండటంపై బీఆర్‌ఎస్ నేత మాజీ ఏపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు చివర తోకలు ఉండి ఉంటే ఈ వేధింపులు ఉండేవి కావన్నారు. ఈ వేధింపులకు అంతం ఎప్పుడు అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో భారీ పోస్టు పెట్టారు.
" డీజీపి ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాల కులంలో పుట్టడమేనా? అయన పేరు చివరన రాజు / నాయుడు / చౌదరి/రెడ్డి /వర్మ/శర్మ లాంటి పేర్లు లేక పోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికీ నిజం. బైదివే, నాకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారు. అది వేరే విషయం."
బ్యాంకులను మోసం చేసిన రఘురామ కృష్ణరాజు జైలులో ఉండటం ఏంటని ప్రశ్నిస్తూనే... స్ట్రిక్ట్ ఆఫీస్‌గా ఉన్న సునీల్ కేసుల్లో ఇరుక్కోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "వందల కోట్లు బ్యాంకులను ముంచి, ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణరాజు జైలు బయట ఉండటమేంటf, మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను గురవడం ఏంటి?"
సునీల్ కుమార్ తనకు 1998 నుంచే తెలుసని అన్నారు ప్రవీణ్ కుమార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రాధాన్యత కల్గిన పోస్టులు ఇవ్వలేదని వివరించారు. "నేను పీవీ సునీల్ బెల్లంపల్లి(ఆదిలాబాద్) 1998 నుంచి కలసి పని చేశాం. ఆయనకు ప్రతి సారి ప్రభుత్వాలు అన్యాయమే చేసినవి. అందరిలాగా నాకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలు కరగలేదు."
ఇలాంటి అణచివేత ఏ మీడియాకు కనిపించదని నిట్టూర్చారు ప్రవీణ్ కుమార్. న్యాయవ్యవస్థలో కూడా ఆయనకు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేశారు. "ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు.""ఇక 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయవ్యవస్థలో పీవీ సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేదు."
మనౌన రోదన చాలని సునీల్ కుమార్‌కు సూచించిన ప్రవీణ్ కుమార్... రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి తుఫైల్ మెమోలాకు విచారణలు లెక్క చేయొద్దని సూచించారు. "ఒకప్పుడు చంద్రబాబు, రోజా తెలిసి తెలిసి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారేమో. I am not surprised at their observation. పీవీ సునీల్ గారు, ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్. ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి పీవీ పులి కుమార్ లా గర్జించండి. ఈ తుఫైల్ మెమోలకు, ఎంక్వైరీ లను పట్టించుకోకండి."
తప్పుడు ఆరోపణలు- చట్టపరమైన చర్యలకు సిద్ధమవ్వండి- సునీల్ హెచ్చరిక
అంతకు ముందు ఈ ఉదయం తనపై వచ్చిన ఆరోపణలు సునీల్ కుమార్ ఖండించారు. " నాపై వచ్చిన అసత్య కథనాలు , ఆరోపణలను ఖండిస్తున్నాను అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అనేది పూర్తిగా గౌరవ హైకోర్టు తీర్పునకు కట్టుబడి, వారు సూచించిన విధి విధానాలను అనుసరించి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో సిఐడి పాత్ర పరిమితం. జిల్లా న్యాయ సహాయ సంస్థ ఆధ్వర్యంలో, రెవెన్యూ , పోలీసు శాఖల జిల్లా అధికారులు భాగస్వాములుగా ఏర్పడిన కమిటీలు స్క్రూటినీ చేసి ఆమోదించిన వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేరుగా చెల్లింపులు చేసింది. కట్టుకథలు అల్లే వారు నిజానిజాలు తెలుసుకోవాలి. వార్త కథనాల్లో ప్రస్తావించిన కాంట్రాక్టర్ అనే వ్యక్తి నన్ను ఎప్పుడూ కలవలేదు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు. నన్ను కలిసినట్లు, కనీసం కాల్ చేసి నట్లు ఒక్క ఆధారం చూపినా చెప్పేది నమ్మవచ్చు. కాని పక్షంలో నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. నాపై అసత్య ఆరోపణలు చేసిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తున్నాను. అన్నారు.