తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం అని, సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎక్కడైనా నోటిఫికేషన్లు, ఉద్యోగుల ప్రక్రియ జరుగుతుందని, తెలంగాణలో మాత్రం పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని ఎద్దేవా చేశారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందంటూ మండిపడ్డారు బండి సంజయ్.
కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. పేపర్ లికేజి కి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. ఈ లికేజ్ ఘటనతో మరోసారి విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని, మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు, బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.
తాండూర్ లో పేపర్ లీక్
తాండూర్ మండల కేంద్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. మొదట పేపర్ లీక్ కాలేదని విద్యాశాఖ అధికారుల చెప్పుకొచ్చారు. అనంతరం పేపర్ లీకైనట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఎంఈవో వెంకటయ్య ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట వాట్సాప్ లో ప్రశ్నాపత్రం ఉంచిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో పేపర్ లీకేజీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పాఠశాలకు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఫోన్ నుంచి వాట్సాప్‌లో షేర్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు బంద్యప్ప పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పినా పేపర్ లీకేజీ వార్తలను పోలీసులు నిర్ధారించారు.
ప్రశ్నాపత్రాలు ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు భద్రత మధ్య తీసుకవస్తారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లో విడదీస్తారు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్ ఫోన్ ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లారు. దీనికి పై అధికారుల నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు. తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన బందెప్పను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.