Bhagyanagar Ganesh Utsav Samithi: ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బారీకేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. అంతేకాక, ట్యాంక్ బండ్ రెయిలింగ్‌కు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి వినాయకుడ్ని నిమజ్జనం చేశారు. ఎవరైనా అక్కడ గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవచ్చని ఉత్సవ సమితి నేతలు పిలుపు ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం జరుగుతుందని అన్నారు. కొత్త రూల్స్ తీసుకువచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని అన్నారు.           


2022లో, 2023లో కూడా ఇదే విధంగా చెప్పారని.. కానీ చివరకు ట్యాంక్ బండ్ లోనేని గణేష్ నిమజ్జనాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని.. నేడు మధ్యాహ్నం వరకూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈరోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజా వర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. 






హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ట్యాంక్ బండ్ పైన పోలీసులు, జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. నిమజ్జనానికి వీలు లేకుండా రెయిలింగ్‌ను కూడా పెట్టారు. దీంతో భాగ్యనగర ఉత్సవ సమితి నేతలు అక్కడకు చేరుకుని.. ఆ ఫ్లెక్సీలను ఆదివారం తొలగించారు. అక్కడి బ్యానర్ లను, బారికేడ్లను తీసేశారు. ఎన్నో ఏళ్లుగా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం నిర్వహిస్తున్నామని.. కానీ ఈసారి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకూడదని నిబంధనలు పెట్టడం సరికాదని అన్నారు.


Also Read: అతి తెలివి మంత్రిగారూ.. మీ చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా? కాంగ్రెస్‌లోనా? - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్