Man Killed His Wife Brother In Hyderabad: భాగ్యనగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆస్తి కోసం సొంత బావమరిదినే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. మృతదేహానికి అంత్యక్రియలు సైతం పూర్తి చేయగా.. మామ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా అగ్రహారానికి చెందిన శ్రీకాంత్‌, అమూల్య దంపతులకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలి జయభేరి కాలనీలో హాస్టల్ నడుపుతున్నాడు. ఆన్ లైన్ గేమింగ్‌తో పాటు చెడు వ్యసనాలకు బానిసై భారీగా అప్పులు చేశాడు. కొంతకాలంగా శ్రీకాంత్ భార్య సోదరుడు యశ్వంత్ (25).. అక్క బావతో కలిసి ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన శ్రీకాంత్ మామ ఆస్తిపై కన్నేశాడు. బావమరిదిని హతమారిస్తే ఆస్తి మొత్తం తనదే అని భావించాడు. 


ఆత్మహత్యగా చిత్రీకరించి..


ఈ క్రమంలోనే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేలా ప్లాన్ చేశాడు. శ్రీకాంత్ తన వంట మనిషి ఆనంద్‌కు.. యశ్వంత్‌ను హతమార్చాలని రూ.10 లక్షల సుఫారీ ఇచ్చాడు. హాస్టల్‌లోనే యశ్వంత్‌ను చున్నీతో గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అనంతరం మృతదేహాన్ని కారులో ఏపీ బార్డర్ వరకూ తీసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్సులో నెల్లూరు జిల్లాలోని అగ్రహారానికి తరలించారు. యశ్వంత్ సూసైడ్ చేసుకున్నాడని.. అత్తమామలు, వారి బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. 


సీసీలు పనిచేయక పోవడంతో


కాగా, యశ్వంత్ అంత్యక్రియలు పూర్తైన కొద్దిరోజులకు కుటుంబ సభ్యులు హాస్టల్లో సీసీ కెమెరాల గురించి ఆరా తీయగా.. అవి పనిచేయకపోవడంతో అనుమానంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చున్నీ, కారు, బైక్, రూ.90 వేల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 


బాలుడి దారుణ హత్య!


అటు, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలో 4 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు విగతజీవిగా మారాడు. చిట్టాపూర్‌కు చెందిన కచ్చు రాకేశ్ (12) గ్రామంలో బుధవారం వినాయకుడు విగ్రహాలు చూసేందుకు వెళ్లి తిరిగిరాలేదని అతని తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరకు బాలుని మృతదేహాన్ని బాల్కొండ ఖిల్లాలో శనివారం గుర్తించారు. మృతదేహంపై దుస్తులున్నాయని.. బాలుడి తల, ముఖంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుని బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేయగా పోలీసులు వారిని సముదాయించారు. 


ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసై..


ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు ఎక్కువ అప్పులు చేసి చివరకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్గి మండలం ముక్తిపాడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (21) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ కొని జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఆన్ లైన్ గేమ్స్‌ అప్పులపాలైతే తండ్రి చెల్లించాడు. వాటి జోలికి వెళ్లొద్దని తండ్రి చెప్పినా మళ్లీ గేమ్స్ ఆడి అప్పుల పాలయ్యాడు. దీంతో తండ్రికి ఏం చెప్పాలో తెలియక శనివారం తన పొలంలోనే గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Also Read: KTR: అతి తెలివి మంత్రిగారూ.. మీ చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా? కాంగ్రెస్‌లోనా? - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్