Revanth Reddy: మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్‌ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తైన తర్వాత  కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జరుగుతున్న పరిణామాలూ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డినే తానే ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. రైతు బిడ్డగా ఆయన సంస్కరణలు నచ్చే పార్టీలో చేరాను. మంచి పనులకు అండగా ఉండి రైతు బాగుపడాలని ఆకాంక్షతో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాం. 




రైతు సంక్షేమం కోసం అందర‌్నీ కలుపుకుని పోతాం: రేవంత్ రెడ్డి


పార్టీలో చేరికల అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించామన్నారు. అండగా పెద్దలు నిలబడాలని కోరినట్టు వెల్లడించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. "రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. భవిష్యత్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతాం." అని రేవంత్ కామెంట్స్ చేశారు. 



ఈ ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తి అయిన వేళ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. సుమారు రెండు గంటల చర్చల అనంతరం పార్టీలో చేరుతున్నట్టు మాజీ స్పీకర్ పోచారం మీడియాకు తెలిపారు. 




కాంగ్రెస్‌ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పోచారం తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. అక్కడ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వంలో మంత్రి, స్పీకర్‌గా పని చేశారు. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్లు ఓడిపోతారనే అపవాదును పోచారం చెరిపేశారు. చాలా ఏళ్లు తర్వాత స్పీకర్‌గా పని చేసిన తర్వాత కూడా ప్రజలను మెప్పించి 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్లుగా పని చేసిన చాలా మంది ఓడిపోయారు. ఈయన మాత్రం చాలా కాలం తర్వాత గెలిచి రికార్డు బ్రేక్ చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు సంస్కరణలు నచ్చి ఆపార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనకు వయసు అయిపోయిందని తన లాంటి వాళ్లకు ఉన్న రాజకీయ భవిష్యత్‌ చాలా తక్కువని చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి యవ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి పనులు చేస్తారని అభిప్రాయపడ్డారు. అందుకే రేవంత్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. 



హైదరాబాద్‌లోని పోచారం నివాసంలో ఈ చర్చలు కొనసాగుతున్న టైంలోనే ఆయన ఇంటి బయట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాల్క సుమన్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బెదిరించి బీఆర్‌ఎస్ నేతలను తీసుకుంటోందని ఆరోపించారు. ప్రజాసమస్యల నుంచి దారి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని విమర్శిస్తూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బాల్కసుమన్ యత్నించారు. దీంతో పోలీసులకు బీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయిదాటిపోక ముందే నేతలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.