మునుగోడు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో సంచలనం రేపిన ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై తాజాగా మరో కేసు నమోదు అయింది. నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉన్నారని బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆయన వద్ద ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లాంటివి నకిలీవని పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదును రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చారు.


ఇటీవల సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత నెల అక్టోబరు 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి రాగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరు నంద కుమార్, సింహయాజిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ అనే వ్యక్తే ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ కు చెందిన నందకుమార్ సాయంతో పైలెట్ రోహిత్ రెడ్డిని పరిచయం చేసుకొని ఆయన ద్వారా టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్‌​లో పేర్కొన్నారు. 


ఈ నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలోనూ రామచంద్ర భారతి ఇలాంటి అనేక మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల గురించి కూడా  ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ధ్రువ పత్రాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నకిలీ ధ్రువ పత్రాలతో ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.