‘‘తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్నాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం. బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు అవగాహన కల్పించే అంశంపై గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ వర్క్ షాపులో బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ‘‘ఈనెల 24న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించనున్న ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని తనతో నడిచేందుకు సిద్ధం కావడం సంతోషంగా ఉంది. బీజేపీ అధ్యక్షుడైన కొత్తలోనే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్లూ వాయిదా వేయాల్సి వచ్చింది. 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నేను దశల వారీగా పాదయాత్రను కొనసాగిస్తా. నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో గడీల, కుటుంబ పాలన సాగుతోంది. అవినీతి, నియంత పాలనతో పేదలు తీవ్రమైన ఇబ్బందులపాలవుతున్నారు.’’
‘‘బీజేపీ కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ మూర్ఖత్వ, నయా నిజాం పాలనవల్ల కష్టాలు పడుతున్నారు. కేసీఆర్ గడీల పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలంతా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీళ్లను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతోనే పాదయాత్ర చేయాలని నిర్ణయించాం. వారి బాధలు, సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారికి అండగా ఉండేందుకు, వారి సమస్యల ఆధారంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాం. గడీలను బద్దలు కొట్టడం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం. టీఆర్ఎస్ మెడలు వంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. కేసీఆర్ మోసాలకు, దొంగ హామీలకు అంతు లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తూ సొంత పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు.
Also Read: Hyderabad News: ఫేక్ పోలీస్ హల్‌చల్.. డాక్టర్ నుంచి రూ.75 లక్షలు లాగేందుకు కుట్ర, చివరికి..
బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి. ఈ విషయంలో అవ్వ కావాలా? బువ్వ కావాలా? తేల్చుకోవాలి. పార్టీ కోసం కుటుంబంతో గడిపే సమయాన్ని కొంత వరకు త్యాగం చేయాలి. ఈ విషయంలో కుటుంబాలను ఒప్పించాలి. ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజల కష్టాలను, బాధలను తుడిచేందుకే కేటాయించాలి. అంతిమంగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు పనిచేయాలి. నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజా సంగ్రామ యాత్రలో పనిచేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుంది. చేసే పనిని బట్టే గుర్తింపు వస్తుందే తప్ప ఫొటోలకు ఫోజులిస్తే మాత్రం గుర్తింపు రాదు.’’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో దళితలపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చారించారు బండి సంజయ్. ఈ విషయంలో తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయనతోపాటు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జీ, ఎంపీ మునుస్వామి, జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ హాజరయ్యారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇకపై దళితుల పక్షాన ఎస్సీ మెర్చా నాయకులంతా ఉద్యమించండి దళితులపై దాడులు జరిగితే తక్షణమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయండని పిలుపునిచ్చారాయన.