Mohan Babu News : మంచు ఫ్యామిలీలో వివాదం కాస్త చల్లబడినా.. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడి విషయం మాత్రం చల్లారడం లేదు. కుమారులు ఇద్దరు వచ్చి వివరణ ఇచ్చినప్పటికీ జర్నలిస్టు సంఘాలు మాత్రం మోహన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దాడిపై పెట్టిన కేసులోసెక్షన్లు మార్చారు. 


మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు


మోహన్‌ బాబు వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు జర్నలిస్టు దాడిని సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత బీఎన్‌ఎస్‌ 118 సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసును బీఎన్‌ఎస్‌ 109 సెక్షన్‌గా మార్చారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు. 


మంగళవారం హైడ్రామా


మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసంలో హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు తన ఫ్యామిలీతో ఇంటి నుంచి బయటకు వచ్చేయడం దాన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలోనే మనోజ్ మరోసారి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెక్యూరిటీ అడ్డుకుంది. అయినా ఆగని మనోజ్‌ గేటును తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. ఆయనతోపాటే మీడియా ప్రతినిధులు కూడా ఇంటిలోకి వెళ్లారు. 


దాడితో అంతా షాక్ 


మీడియా ప్రతినిధులను చూసిన మోహన్ బాబు నమస్కారం చేసుకుంటూ వచ్చారు. ఆయన మాట్లాడతారేమో అనుకొని ఓ ఛానల్ ప్రతినిధి లోగోను ఆయనకు దగ్గరగా తీసుకెళ్లారు. అంతే సడెన్‌గా ఆ మైక్‌ లాక్కొని సదరు ఛానల్ ప్రతినిధిపై దాడి చేశారు. కోపంతో ఊగిపోయి తిడుతూ అటాక్ చేశారు. ఒక్కసారిగా మోహన్ బాబు ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసిన మీడియా ప్రతినిధులు, అక్కడ ఉన్న ఇతరులు నిర్ఘాంతపోయారు. 


మొదట సాధారణ సెక్షన్ కింద కేసు


లోగోతో మోహన్ బాబు దాడి చేయడం వల్ల సదరు రిపోర్ట్ మొహంపై గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. సదరు ఛానల్ ప్రతినిధులు మోహన్ బాబుపై కేసులు పెట్టారు. మీడియా ప్రతినిధుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు బుధవారం బీఎన్‌ఎస్‌ 118 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. దీన్ని ఇప్పుడు హత్యాయత్నం కేసుగా మార్చారు. 


శాంతించిన మంచు మంటలు 


మరోవైపు మంచు మోహన్ బాబు ఇంటిలో తలెత్తిన వివాదం ప్రస్తుతానికి శాంతించినట్టు కనిపిస్తోంది. మధ్యవర్తుల జోక్యంతో అటు మనోజ్‌, ఇటు విష్ణు వర్గాలు శాంతించినట్టు సమాచారం. పోలీసులు, కోర్టు ఆదేశాలతో కూడా ఇరు వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించారని టాక్ నడుస్తోంది. అందుకే రాచకొండ పోలీసుల ఎదుట వేర్వేరుగా హాజరైన మంచు విష్ణు, మంచు మనోజ్‌ లక్ష రూపాయల పూచికత్తు బాండ్లను సమర్పించారు. 


ఇద్దరిపై బైండోవర్‌


రాచకొండ పోలీసు కమిషనర్‌ సుదీర్‌బాబు ఇద్దర్ని సుదీర్ఘ సమయం విచారించారు. వీళ్లిద్దర్నీ వేర్వేరుగా పోలీసు కమిషనర్‌ సుదీర్‌బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ హోదాలో దాదాపు గంటన్నర చొప్పున విచారించారు. కొద్ది రోజులుగా శాంతిభద్రతలు తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయని మరోసారి అలాంటివి జరగకుండా చూసుకుంటామని ఇద్దరూ పోలీసులకు హామీ ఇచ్చారు. చట్టానికి కట్టుబడి నడుచుకుంటామని తెలిపారు. ఇలా పోలీసులకు మాట ఇస్తూ బాండ్ రాసిన లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించారు. ఏడాది పాటు బైండోవర్‌కు కట్టుబడి ఉంటామన్నారు విష్ణు,మనోజ్‌. 


Also Read: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..


జల్‌పల్లిలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు 


మరోవైపు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటిలో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. మిగతా వారందర్నీ పంపేశారు. రెండు రోజుల క్రితం మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు వ్యక్తిగత సహాయకుడు వెంకట కిరణ్‌ను పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. 


మంచు లక్ష్మి శాంతి వచనం 


పరిణామాలు ఇలా ఉంటే మోహన్ బాబు కుమార్తె సోషల్ మీడియాలో శాంతి మంత్రం జపించారు. పీస్ అంటూ మెసేజ్‌లు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలో ఏదీ నీది కాదన్నప్పుడు ఏదో కోల్పోతావు అనే భయం ఎందుకంటూ మార్కస్ ఆరేలియస్ కొటేషన్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. 


Also Read: మోహన్ బాబు మామూలోడు కాదు, చెప్పాలంటే చాలా ఉంది వివాదాల చరిత్ర!