Ashada Masam Bonalu: హైదరాబాద్ లో జూన్ 22వ తేదీ నుంచి ఆషాఢ మాసం బోనాల పండుగ మొదలు కాబోతుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో నెల రోజుల పాటు బోనాల జాతర మొదలు కాబోతుంది. ఈ మేరకు శుక్రవారం రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. జూన్ 22వ తేదీ గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండగా.. జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆ తర్వాతి రోజు అంటే జూలై 10వ తేదీన రంగం ఉంటుంది. ఇక 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


బోనాల విశిష్టత చాటేలా


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే సాంప్రదాయం యావత్ తెలంగాణ అంతటా ఉంది. బోనాలను మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు ఇలా రకరకాల దేవతల పేరిట నిర్వహిస్తుంటారు. అదే తరహాలో హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు ఏటా జరుగుతుంటాయి. ఈ బోనాల సమయంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. పండగ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలవుతుంది. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతుంది. గత ఏడాది ఉజ్జయిని మహాంకాళి బోనాలు జూలై 17వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ వైభవంగా జరగనుందని అన్నారు.



ప్రత్యేక ఆకర్షణగా రంగం


బోనాల సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా రంగం కార్యక్రమం నిలుస్తుంది. బోనాలు జరిగిన మరుసటి రోజు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో రంగం కార్యక్రమం ఉంటుంది. స్వర్ణలత అనే మహిళకు అమ్మవారు పూనుతారు. ఆమె నోటి నుంచి వచ్చే మాటలు స్వయంగా అమ్మవారే చెప్పినట్టుగా భక్తులు భావిస్తుంటారు. అమ్మవారికి ఎంత భక్తితో బోనం సమర్పిస్తారో అంతే భక్తి భావంతో రంగాన్నిభక్తులు వింటారు. గత బోనాల సందర్భంగా రంగంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు మెక్కుబడిగా చేస్తున్నారని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు వారి సంతోషానికే తప్ప, తన కోసం చేయడం లేదని చెప్పారు. గర్భాలయంలో శాస్త్రబద్దంగా పూజలు చేయాలని చెప్పారు. 


Also Read: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు ముహూర్తం ఖరారు