Arekapudi Gandhi: పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్టేషన్ బెయిల్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ తదితరులు అరెకపూడికి సంఘీభావం తెలిపారు. పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లా. కానీ, వాళ్లు మాపై దాడి చేశారు. కౌశిక్ భార్య విల్లాపై నుంచి కుండీ, మొక్కలు మా కార్యకర్తలపై విసిరారు. 40 మంది నన్ను అడ్డుకున్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. నన్ను ఆంధ్రా వాడు అన్నారు. అదే బీఆర్ఎస్ విధానమైతే ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పార్టీ అధినేత కేసీఆర్.. కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని గాంధీ డిమాండ్ చేశారు.
చీర - గాజుల రాజకీయం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు గాజులు, చీరలు పంపిస్తున్నానని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలని, లేకుంటే తాను పంపుతున్న చీర కట్టుకుని, గాజులు వేసుకోవాలని సవాల్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మొగోళ్లు కాదంటూ కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పూటకో పార్టీ మారే బిచ్చగాడు దానం నాగేందర్ అని, శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుతో గజగజ వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు అని, ఉప ఎన్నికలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. పీఏసీ చైర్మన్‌గా నియమితులైన అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడైతే తెలంగాణ భవన్ కు రావాలన్నాడు.
కౌశిక్ రెడ్డి ఓ కోవర్ట్
దీనికి అరెకపూడి గాంధీ స్పందించారు. కౌశిక్‌రెడ్డి దొంగ అని తెలుసుకోకుండా పార్టీలో స్థానం ఇచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగాలేదన్నారు. కౌశిక్‌రెడ్డి తీరు వల్లనే బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలయిందని ఆరోపించారు. అతను కోవర్టుగా వ్యవహరించారని, అంతే కాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని అరికెపూడి ధ్వజమెత్తారు. కౌశిక్ సవాల్‌ను స్వీకరించిన అరికెపూడి కొండాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ‘మీ ఇంటికొస్తా.. జెండా ఎగరేస్తా' అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన రాకపోతే తానే స్వయంగా అతడి ఇంటికి వెళ్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే తన అనుచరులతో కలిసి అరికెపూడి గాంధీ కౌశిక్ ఇంటికి చేరారు. అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
అరికెపూడి అరెస్ట్
కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించగా పోలీసులు అక్కడి నుంచి ఆయనను పంపించే ప్రయత్నం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని అరెకపూడి డిమాండ్ చేశారు. అతడి ఇంటి వద్ద కూర్చొని అరెకపూడి అనుచరులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టమాటాలు కోడిగుడ్లతో దాడులు చేసుకున్నారు. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
నన్ను హత్య చేసే కుట్ర
ఈ ఘటనపై కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణనే లేదు.. ఇక సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణకు ఎలా ఇస్తుంది? అని ప్రశ్నించారు. తనను హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని ఆరోపించారు. శుక్రవారం 11 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చారన్న కౌశిక్, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని స్పష్టం చేశారు.