Telangana Political News Latest: సైబరాబాద్ సీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తన ఇంటిపై దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు అందర్నీ పోలీసులు అనుమతించలేదు. హరీశ్ రావు మాత్రమే సీపీ ఆఫీసులోకి వెళ్లారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సీపీకి మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు.


అయితే, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి కారణమైన వారిని పోలీసులు అరెస్టు చేసే వరకూ తాము అక్కడి నుంచి కదలబోమని హరీశ్ రావు తేల్చి చెప్పారు. అర్ధరాత్రి 12 అయినా సరే అక్కడే ఉంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దాడి చేసిన వాళ్ల మీద యాక్షన్ కనుక తీసుకోకపోతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని.. ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెడతామని అన్నారు.


మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నాయకులు సీపీ కార్యాలయంలో భీష్మించుకొని కూర్చొన్నారు. సీఐ, ఏసీపీ దగ్గరుండి దాడిని ప్రోత్సహించారని.. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.