Telangana Latest News: నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడకో నైజాం సర్కారోడా అన్న తెలంగాణ ఉద్యమ గీతం. ఆ గీతాన్ని ఆలపించిన ప్రజానౌక గద్దర్‌తో తన బాంధ్యవ్యాన్ని గుర్తుచేసుకోవడం. తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణ నేల తల్లికి వందనాలు అంటు జనసేనాని ప్రస్తావించడం. ఇవన్నీ జనసేన పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు నోట వెలువడిన తెలంగానం. అయితే జన సేనాని పవన్ మాటలు కాకతాళీయమా.. లేక వ్యూహాత్మకమా అన్న చర్చ సాగుతోంది.


పార్టీ ప్లీనరీ అంటే....?
రాజకీయ పార్టీ అయినా, ఉద్యమ పార్టీలయినా ప్లీనరీ నిర్వహించడం సాధారణమే. అయితే ఇందులో రెండు అంశాలు ప్రధానంగా గుర్తించాల్సినవి. ప్రతీ పార్టీ అప్పటి వరకు తాము సాధించిన జయాలు లేదా అపజయాలను సమీక్ష చేసుకుంటారు. రానున్న రోజుల్లో తమ పార్టీ కార్యాచరణ ఏంటో దిశా నిర్దేశం చేస్తారు. అయితే పవన్ తన ప్లీనరీలో తన కార్యాచరణగా తెలంగాణలో రాజకీయ పార్టీని యాక్టివేట్ చేయడం ఉద్దేశంగా పై వ్యాఖ్యలు చేశారా అన్నది ఇప్పుడు ప్రశ్న.  రాజకీయాల్లో పరిణితి చెందిన లీడర్లు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఇక ప్లీనరీలాంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు చాలా పకడ్బందీగా రాజకీయ ప్రసంగాన్ని తయారు చేస్తారు. తాము ఏం మాట్లాడాలి. ఎలాంటి సంకేతాలు పార్టీ క్యాడర్‌కు లీడర్లకు పంపాలి అన్న దానిపై చాలా కసరత్తు చేస్తారు. ఆషా మాషీగా ఏ మాట ఇలాంటి వేదికల నుంచి మాట్లాడరు. అలాంటిది పార్టీ ప్లీనరీ వేదిక నుంచి పపన్ తెలంగాణ అంశాలు స్పృశించడం అనేది ఎంత మాత్రం కాకతాళీయంగా మాట్లాడిన అంశం కాదు. రానున్న రోజుల్లో జనసేనాని చూపు, లక్ష్యం రెండో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ మీదనే అన్న సంకేతాలు పంపే ఉద్దేశంతోనే అన్న చర్చ సాగుతోంది.


తెలంగాణలో జన సేనకు అవకాశాలు ఉన్నాయా ?
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్నాయి. మరో పార్టీకి అవకాశం లేదనే చెప్పాలి. అలాగని జనసేనకు అవకాశం లేదని కాదు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అక్కడ అధికారం పంచుకుంటున్నాయి. అదే వ్యూహంతో తెలంగాణలోకి జన సేన అడుగుపెట్టే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేం. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ఒక రాజ్య సభ సభ్యుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే జరిగిన మూడు ఎమ్మెల్సీలకుగాను రెండు ఎమ్మెల్సీలను బీజేపీ గెల్చుకుంది. ఈ బలంతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణ అధికార పీఠం దక్కించుకోవాలన్న లక్ష్యంతో సాగుతోంది. ఈ తరుణంలో అటు జన సేన, టీడీపీ వంటి పార్టీలతో కలిసి అధికారం పంచుకోవడానికి సిద్ధపడే అవకాశం లేకపోలేదు. అయితే ఈ రెండు పార్టీల బలం తెలంగాణలో లేదు. కానీ రానున్న రోజుల్లో ఆ రెండు పార్టీల అభిమానగణం కావచ్చు, టీడీపీకి ఎంతో కొంత ఉన్న పట్టు కావచ్చు బీజేపీకి సహకరించవచ్చు అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు సైతం తెలంగాణకు తరచూ వస్తూ పార్టీని బలోపేతం చేస్తా అన్న సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడు పార్టీ ప్లీనరీ వేదిక నుంచి పవన్ కూడా తెలంగాణకు వస్తా అన్న సంకేతాలు పంపడం జరిగింది.


జనసేన రావాలంటే వాడే అస్త్రం ఇదేనా...?
తెలంగాణలో పవన్ కల్యాణ్‌ రాజకీయాలు చేయాలంటే ఉన్న అస్త్రం ఒక్కటే. అది ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. అదే హిందుత్వ. హిందూ ధర్మ పరిరక్షణ అనే అస్త్రంతోనే పవన్ తెలంగాణలో అడుగుపెట్టే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకిగా ఇప్పటికే బీఆర్ఎస్ పవన్ ను ఇక్కడ చిత్రీకరించింది. ఆ ముద్రను పోగొట్టుకోవాలంటే అంత కన్నా పవర్ ఫుల్ వెపన్ పవన్  ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ప్రయోగిస్తున్నారు. అయితే ఇదే అస్త్రం బీజేపీ ప్రయోగించినా దక్షిణాది ప్రజలను గెల్చుకోలేకపోయింది. సరైన వ్యక్తి చేతిలో సరైన అస్త్రం ఉండాలన్న వ్యూహంతో బీజేపీ ఇప్పుడు పవన్‌ను హిందుత్వ అస్త్రం ప్రయోగించే సరైన వ్యక్తిగా గుర్తించింది. ఈ కారణంతోనే పవన్ కు ప్రధాని మోదీ నుంచి ఇతర బీజేపీ నేతలు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాదుకోవాలంటే అడ్డుగా ఉన్న గోడలు బద్దలు కొట్టాల్సిందే.  ఆ భాధ్యతను పవన్ కు అప్పగించారన్న చర్చ ప్రస్తుత రాజకీయాల్లో సాగుతోంది.  ఇదే హిందుత్వ అంశంతోనే తెలంగాణలోకి ప్రవేశిస్తారన్న చర్చ సాగుతోంది. 


జన సేన తెలంగాణలో రంగ ప్రవేశం ఎప్పుడంటే..?
తెలంగాణలో జనసేన రంగ ప్రేవేశం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వేసుకుంటే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటిన్ సిటీలో అనేక ప్రాంతాల ప్రజలు,  ఏపీ నుంచి సెటిలర్లు అధికంగా ఉన్నారు.  పవన్ పై తెలంగాణ భావజాల వ్యతిరేకులు ఇక్కడ తక్కువే అనిచెప్పాలి. ఈ ఎన్నికల్లో బరిలో దిగడం ద్వారా అది బీజేపీ సహకారంతో బరిలో ఉంటారా అన్న చర్చ నడుస్తోంది. లేదా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ద్వారా తెలంగాణలో రాజకీయ రంగప్రవేశం జరుగుతుందా అన్న చర్చ నడుస్తోంది. లేదా వచ్చే శాసనసభ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగేలా పవన్ వ్యూహాలు ఉంటాయా అన్నది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే..