Anand Mahindra: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఓ వేదికపై మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఓ ప్రముఖ వ్యక్తి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేరును రేవంత్ రెడ్డి ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనంద్ మహీంద్రాను నియమించబోతున్నట్టు అమెరికాలో వెల్లడించారు. స్కిల్‌ వర్సిటీ ఛైర్మన్‌గా ఆయన రెండు లేదా మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు.


తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ వేదికగా ప్రకటించి.. అదే రోజు సాయంత్రం భూమి పూజ కూడా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో స్కిల్‌ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టారు. ఇందులో 17 కోర్సులు అందుబాటులో ఉంచుతామని.. యువతకు మెరుగైన శిక్షణ ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగుల సర్టిఫికెట్లు మాత్రమే ఉన్నాయని.. నైపుణ్యాలు లేవని గుర్తించి స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 


ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో యువతకు సాంకేతిక నైపుణ్యాలు కూడా నేర్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ తో నిర్వహించే ఈ యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ కోర్సులను 3 రకాలుగా అందించనున్నారు. ఇందులో డిగ్రీ పట్టా కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఫీజు ఏడాదికి రూ.50 వేలుగా నిర్ణయించినట్టు ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. 


అంతేకాక, ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తో పాటుగా హాస్టల్‌ వసతి కూడా కల్పిస్తామని తెలిపింది. వర్సిటీ భవనం పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో 1500 మందికి, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ లో మరో 500 మందికి 6 కోర్సుల్లో క్లాసులు ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అనంతర కాలంలో యూనివర్సిటీని భవిష్యత్తులో వేర్వేరు జిల్లాలకు కూడా విస్తరింపజేయనున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ కోసం ముచ్చర్లలో 57 ఎకరాల భూమిని కేటాయించారు. బేగరికంచెలో సొంత బిల్డింగ్ పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా బిల్డింగ్‌లో యూనివర్సిటీ కొనసాగనుంది.