Hyderabad: హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భాగ్యనగర డిక్లరేషన్ పేరుతో ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొవిడ్, సర్జికల్ స్ట్రైక్స్, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం, ఇలా ప్రతి అంశంపైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అవకాశవాద, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మారిందని అమిత్ షా అన్నారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో బీజేపీలో అధికారంలోకి వస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ సమావేశాల తర్వాత 3 రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా 200 పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించి, కేంద్ర మంత్రులను ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా నియమించారు.
Also Read: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
నియోజకవర్గాలకు నేతలు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి 350 మంది బీజేపీ నాయకులు జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు, తెలంగాణలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు పర్యటించారు. స్థానిక బీజేపీ నేతల ఇళ్లలో బస చేశారు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం ఎలా చేయాలనే అంశంపై దిశా నిర్ధేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని దేశంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతలు అమలు చేయాలని చూస్తున్నారు.