Telangana Intelligence Officer in BJP National Executive Meeting: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ - హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం లోనికి తెలంగాణ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ అధికారి ప్రవేశించడం కలకలం రేగింది. అది అంతర్గత సమావేశం కాగా, మీడియా సహా ఇతరులు ఎవరికీ ప్రవేశం లేదు. అలాంటి సమావేశంలోకి ఇంటెలిజెన్స్ అధికారి వచ్చినట్లుగా బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఆయన తీర్మానాల కాపీని ఫోటో తీస్తుండగా దొరికిపోయారని అన్నారు. ఈ అంశంపై ఇంద్రసేనా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారి శ్రీనివాసరావుగా గుర్తించామని చెప్పారు.
అంతర్గత సమావేశానికి అధికారిని పంపించి నిఘా పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదని, వారి అంతర్గత సమావేశాలకు తమ వ్యక్తులను ఏనాడూ పంపలేదని గుర్తు చేశారు. కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్‌ను అధికారి ఫోటో తీసే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నామని అన్నారు. ఇంటెలిజెన్స్ అధికారిని పట్టుకొని సీపీకి అప్పగించామని చెప్పారు. ఆయన ఫోన్ లో అప్పటికే తీసిన ఫోటోలను డిలీట్ చేయించామని చెప్పారు.
పోలీసుల పాసులతో నిఘా అధికారి లోనికి ప్రవేశించారని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏ పార్టీ ప్రైవసీ వారికి ఉంటుందని వివరించారు. ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇంద్రసేనా రెడ్డి డిమాండ్ చేశారు.