బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించడం ఖాయమైనప్పటి నుంచి నగరంలో టీఆర్ఎస్ కాషాయ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన కూడళ్లు సహా, మెట్రో స్తంభాలపై, లాలీపాప్ తరహా యాడ్స్ సహా పెద్ద పెద్ద హోర్డింగులను ఆ రెండు పార్టీలే బుక్ చేసుకున్నాయి. ఓ దశలో చాలా వరకూ ప్రకటనలన్నీ ముందస్తుగానే టీఆర్ఎస్ బుక్ చేసేసుకుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించి ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతూ, డెవలప్‌మెంట్ పనులకు సంబంధించి భారీ ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఈ రెండు పార్టీలు నిర్దేశిత ప్రాంతాల్లోనే కాకుండా, అనుమతి లేని ప్రదేశాల్లోనూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. నగరవ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేని చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులకు జీహెచ్‌ఎంసీ అధికారులు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు జరిమానాలు విధించారు.
శనివారం సాయంత్రం వరకూ బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్ పార్టీకి రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, విపత్తు నిర్వహణ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో, ‘తెలంగాణ ది పవర్ హౌస్’ పేరుతో ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎల్బీ నగర్ పరిధిలోని చైతన్యపురి ప్రాంతంలో ఫ్లెక్సీలపై, సికింద్రాబాద్‌లో నేడు నిర్వహించనున్న విజయ సంకల్ప సభ ఫ్లెక్సీలను బీజేపీ నేతలు అతికించారు.
నగరమంతా రెండు పార్టీల ఫ్లెక్సీలే..
టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, హోర్డింగులతో నగరమంతా గులాబీ, కాషామయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ సహా సమావేశాలకు వచ్చే ముఖ్య నేతలకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సాలు దొర సెలవు దొర అంటూ ఫ్లెక్సీలతో కేసీఆర్‌ను టార్గెట్ చేయగా, అందుకు పోటీగా టీఆర్ఎస్ కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ లో బై బై మోదీ, సాలు మోదీ సంపకు మోదీ వంటి స్లోగన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.