హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడితో మృతి చెందిన ప్రదీప్‌ ఘటనపై స్పందించారు బ్లూ క్లాస్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వహకురాలు అక్కినేని అమల. ఇది చాలా విచారకరమైనది అభివర్ణించారు. అయితే కుక్కలను శత్రువులుగా చూడద్దని హితవు పలికారామె. వాటిని ప్రేమ, కరుణతో చూడాలని విజ్ఞప్తి చేశారు. 


కొన్ని ఘటనల కారణంగా కుక్కలపై వ్యతిరేక భావం వద్దని... వాటిని శత్రువులుగా చూడొద్దన్నారు అమల. మనం వాటిని ప్రేమిస్తే అవి మనల్ని అంతకు పదింతలు ప్రేమిస్తాయన్నారు. కుక్కలను చంపడం, కొట్టడం ఇప్పుడు జరిగే ఘటనలకు సమాధానం కాదన్నారు. 
మనుషులకు, కుక్కల మధ్య చాలా 50,000 సంవత్సరాల క్రితం నుంచే అనుబంధం ఉందని గుర్తు చేశారు అమల. వాటి నిర్మూలన సమస్యకు పరిష్కారం కాదన్నారు. వీధి కుక్కల పెరుగుదలకు ప్రధాన కారణం సరైన జనన నియంత్రణ చర్యలు లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకునే బదులు జంతువుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జంతు ప్రేమికురాలిగా, కార్యకర్తగా జంతు సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశానని అమల స్పష్టం చేశారు.


ఏపీ, తెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. నిన్న నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. అయితే బాలుడు చాకచక్యంగా వీధికుక్కల దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. 


విజయవాడలో వీధికుక్కల దాడి 


విజయవాడ నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. భవానీపురంలో ఒకే రోజు ముగ్గురు పిల్లలపై వీధికుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో నజీర్, చైతన్య, జెస్సికా గాయపడ్డారు. నగరంలో పిచ్చికుక్కలు పెరిగిపోవడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


మంచిర్యాలలో పిచ్చికుక్కల స్వైర విహారం


మంచిర్యాల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి.  మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో  రెండు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.  సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయపడ్డారు. కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందికి కుక్కల స్వైర విహారం గురించి ఫిర్యాదు చేయగా.. గత రాత్రి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది వాటికి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కుక్కలు దొరినట్టే దొరికి పారిపోవడంతో మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే వాటిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించడం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.


జీహెచ్ఎంసీ చర్యలు 


హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ ప్రతిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను  జారీచేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదను తగ్గించేందుకు  పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.  జీహెచ్ఎంసీ పరిధిలో జంతు పరిరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నారు.  నగరంలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా.. కుక్కల బర్త్ కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 30 సర్కిళ్లలో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్  చర్యలు చేపడుతున్నారు. గతంలో కుక్కల గణన సందర్భంగా ఐదు లక్షల 75 వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో 75 నుంచి 80 శాతం వరకు బర్త్ కంట్రోల్ చేశారు. జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.